పరగ చితాస్థిభస్మ నృకపాలజటాధరుడుం బరేత భూ
చరుడు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా దలంప రె
వ్వరు; నొక డీవు దక్క, మఱి వాక్పతిముఖ్యులు నమ్మహాత్ము స
చ్చరణ సరోజ రేణువులు సమ్మతి దాల్తురు మస్తకంబులన్.
పిలువని పేరంటానికి వెళితే అవమానం పాలవుతుందని చెప్పినా, పుట్టింటిపై ప్రేమతో తండ్రి దక్షుడు చేస్తున్న యాగానికి వెళ్ళింది సతీదేవి. అక్కడ నిరాదరణకు గురవడమే గాక, శివనిందను వినవలసివచ్చింది. దానితో మనస్తాపం చెందిన సతీదేవి యీ విధంగా తండ్రికి హితవు పలికింది.
" చితిలోని ఎముకలను ధరించి, బూడిదను పూసుకొని, మానవకపాలాన్ని భిక్షాపాత్రగా పట్టుకొని, పిశాచ గణాలతో శ్మశానంలో తిరిగినా, శివుణ్ణి అమంగళుడని ఎవరూ భావించరు. బ్రహ్మాదిదేవతలు ఆ పరమశివుని పాదధూళిని భక్తితో తలపై ధరిస్తారు. "
శివ అనే మాటలోనే మంగళకరుడు అన్న అర్థం ఉంది. అటువంటి శివుణ్ణి నిదించడం తగదని, మహాపాపమని తెలియజేసే యీ పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతము చతుర్థస్కంథము దక్షయజ్ఞ ఘట్టంలో ఉంది.
No comments:
Post a Comment