శ్రీకంఠచాపఖండన
పాకారిప్రముఖవినుత భండన! విలస
త్కాకుత్స్థ వంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధము నందలి స్తుతిపూర్వకమైన పద్యమిది. అందమైన కంద పద్యం. చిన్న పద్యమైనా యెంతో విశేషమున్న పద్యం. చిన్నప్పటినుంచి పెద్దలు చెబుతుంటే విన్న పద్యం, నోరార నలుగురు పలికే పద్యం.
శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠంలో దాచుకున్న శివుడు. లోకకళ్యాణం కోసం చేశాడు యీ పని. శ్రీ అనే పదానికి శుభప్రదమైనది అని అర్థం. ఆ శ్రీకంఠుని ధనుస్సును చెఱుకుగడలాగ విరిచినవాడు, పాకాసురుని శత్రువైన ఇంద్రుడు మొదలగు దేవతలచే కీర్తింపబడిన యుద్ధము కలవాడు, ప్రసిద్ధమైన కకుత్స్థవంశానికి అలంకారమైనవాడు, నిండుపున్నమి వంటి యశస్సు పూర్తిగా కలవాడు, అయిన రాముడనే ప్రజలకు ఆనందం కలిగించే రాముని స్తుతిస్తున్నాడు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండయిన సూతుడు. ఈ భాగవత పురాణాన్ని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి వినిపిస్తున్నాడు.
ఈ పద్యంలో చెప్పబడిన శివధనుర్భంగ ఘట్టము అందరికీ తెలిసిందే. పాకాసురుడిని ఇంద్రుడు వధించడం కొందరికి తెలుసు. కకుత్స్థుని గూర్చి చాలమందికి తెలియదు.
సూర్యవంశంలో కకుత్స్థుడు అనే మహారాజు ఉన్నాడు. ఈయన అసలు పేరు పురంజయుడు. దేవతలు రాక్షసుల బాధలు తట్టుకొనలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు పురంజయుని వద్దకు వెళ్ళమన్నాడు. పురంజయుని వద్దకు వెళ్ళిన దేవతలను, యుద్ధం చేయడానికి తనకు ఒక వాహనం కావాలన్నాడు. అప్పుడు, ఇంద్రుడు వృషభ రూపం దాల్చి, పురంజయుడిని తన మూపురంపై ఎక్కించుకున్నాడు. ఎద్దు మూపురం మీద యెక్కి యుద్ధం చేసి, విజయం సాధించాడు కనుక, పురంజయుడు ఆనాటినుండి కకుత్స్థుడని, ఇంద్రవాహనుడని పేరొందాడు. అతని వంశం కాకుత్స్థవంశం అయింది.
ఇక చంద్రునిలో పదహారు కళలున్నాయి. అవి, అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత, అనేవి.
No comments:
Post a Comment