దర్శనమాత్ర తర్పిత హృదంతర భావుడు సాధుమూర్తి యా
దర్శగతాత్మబింబ కలితంబుగ నక్కపిరాజు జూపెడున్
స్పర్శముచేత వాయుసుఖశైత్యము దీపితమెట్లొ భావనా
మర్శితవాక్కుచే నుభయ మంజులభావము దీప్తమయ్యెడున్
ఇంతటి చారుధీకు వినయేందిరు సాధుని వాక్ప్రతిష్ఠు నా
చెంతకు బంచినట్టి కపిశేఖరు నౌచితి హృద్యమయ్యెడున్
జింత సురారి చెప్పినది చెప్పినయట్టుల గానిపించు దా
నింతటి మంత్రి నేలెడు కపీశ్వరు డెంతటివాడు కావలెన్.
సుగ్రీవుని ఆదేశం మేరకు భిక్షుకుని వేషంలో హనుమంతుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. హనుమంతుని చూడగానే శ్రీరాముని హృదయంలో మెదిలిన భావములకు అక్షర రూపమే యీ రెండు పద్యాలు.
" ఇతణ్ణి చూసినంత మాత్రం చేతనే, నా హృదయంలో ఏదో తెలియని తృప్తి కలుగుతున్నది. ఇతడు సత్త్వగుణం ప్రధానంగా కలవాడిగా కనిపిస్తున్నాడు. అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకొన్నట్లు, ఈయనను చూస్తే నన్ను నేనే చూసుకొన్నట్లుంది. స్పర్శ చేత గాలిలో ఉన్న చల్లదనం యెట్లా తెలుస్తుందో, ఇతని మాటలో ఉన్న భావనా సంయమనము చేత, ఇతని వాక్కు, మనస్సు రెండింటి యందు గల మృదుత్వం తెలుస్తున్నాయి.
ఆహా! ఇంతటి బుద్ధినైశిత్యం, వినయం , మంచితనం, మాటనేర్పు కలవానిని నా వద్దకు పంపినట్టి వానరరాజు ఔచిత్యం హృదయాన్ని తాకుతున్నది. కబంధుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగేటట్లున్నది. ఇంత గొప్పవానిని మంత్రిగా పెట్టుకున్న వానరేశ్వరుడు ఎంత గొప్పవాడు అయిఉండాలి! "
శ్రీమద్రామయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండము లోని యీ రెండు పద్యాలు, హనుమంతుని, శ్రీరామచంద్రుని హృదయ నిర్మలత్వాన్ని, మంజులభావాన్ని తెలియజేస్తున్నాయి.
ఎదుటివాని హృదయ నిర్మలత్వం చూడాలంటే, చూసేవాని హృదయ మంజులభావం ఎంతటిదయి ఉండాలి?
No comments:
Post a Comment