శతరూపాపతి కామభోగ విరతిన్ సంత్యక్త భూ భారుడై
సతియుం దానును గానకేగి శతవర్షంబుల్ సునందానదిన్
వ్రతియై యేకపదస్థుడై నియతుడై వాచం యమస్ఫూర్తితో
గతదోషుండు తపంబు జేసె భువనఖ్యాతంబుతో భూవరా!
మనం ఏదైనా పూజాకార్యక్రమం చేపట్టేటప్పుడు " శ్వేతవరాహ కల్పే " అని సంకల్పం చెప్పుకుంటాము. అంటే, మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము. ఈ కల్పంలో పదునాల్గురు మనువులు పాలిస్తారు. ఇది ఏడవ మన్వంతరం, వైవస్వత మన్వంతరం. మానవజాతికి మార్గదర్శనం చేసిన మొట్టమొదటి మనువు స్వాయంభువ మనువు.
స్వాయంభువునకు ఆకూతి, దేవహూతి అనే ఇద్దరు కుమార్తెలు. ఆకూతికి కపిలుడు, దేవహూతికి యజ్ఞుడు శ్రీహరి అంశతో పుట్టారు.
స్వాయంభువ మనువు భార్య శతరూప. ఈ స్వాయంభువ మనువు ఎన్నో సంవత్సరాలు భోగాలు అనుభవించి, చివరకు విరక్తి చెందారు. రాజ్యభోగాలను విడిచిపెట్టి, తపస్సు చేయడానికి, భార్య శతరూపతో కలిసి అడవికి వెళ్ళాడు. అక్కడ సునందానది దగ్గర నియమనిష్ఠలతో, ఒంటికాలి మీద, ప్రపంచం అబ్బురపడేటట్లు తపస్సు చేశాడు.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమస్కంధములోని యీ పద్యం ప్రథమ మనువు స్వాయంభువు గురించి తెలుసుకొనడానికి ఉపయోగబడుతుంది.
No comments:
Post a Comment