మితహితసత్యవాక్య! జనమేజయ! భూజనవంద్య! యేను సు
స్థితి గురుదేవకార్యములు సేయగబూను టెఱింగి, వంచనో
న్నతమతియై యకారణమ నా కపకారము సేసె దక్షకుం
డతికుటిలస్వభావుడు పరాత్మవిశేషవివేకశూన్యుడై.
ఉదంకుడు జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆయనను " మితహితసత్యవాక్య! " అని సంబోధించాడు.
మితహితసత్యవాక్య! ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఇతరులకు ప్రియం కలిగే విధంగా మాట్లాడతాడు. నిజం మాట్లాడతాడు. ఈ సంబోధన చాలు ఎదుటివారి మనస్సు గెలుచుకోవడానికి. జనమేజయునిలో, సర్పయాగ బుద్ధిని కలిగించడానికి వచ్చిన ఉదంకుడు, సంబోధనతోనే సగం పనిని సాధించాడు. ఆ తరువాత, ' భూజనవంద్య ' అన్నాడు. మితహితసత్యవాక్పరిపాలన చేసేవాడు అందరి మన్ననలు పొందడం సహజమే కదా!
తరువాత, ఏమి చెప్పదలచుకున్నాడో అది బయటపెట్టాడు. ఏమిటది? " నేను మంచి మనసుతో, గురువుల, దేవతల ఋణం తీర్చుకుందామనుకుంటే, పాడుబుద్ధితో, తక్షకుడనే సర్పరాజు, తన పర భేదం (అనగా తన కుటిల స్వభావము, ఉదంకుని తపోమహిమల తారతమ్యము) తెలుసుకొనే జ్ఞానం లేకుండా, అకారణంగా నాకు హాని చేశాడు.
సాధుజీవనం సాగించేవారు తమకు ఇతరుల వల్ల కలిగే బాధలను, ధర్మప్రవర్తకులైన రాజుల వద్ద విన్నవించుకోవడం సహజం. అయితే, ఇక్కడ " అకారణమ " అన్న మాట గమనార్హం.
ఆదిపర్వం మొదట్లోనే, " తగు నిది తగదని యెదలో/ వగవక, పేదవారల కెగ్గుల్/ మొగి జేయు దుర్వినీతుల / కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్. " అని సరమ అనే దేవతల కుక్క జనమేజయుడు యజ్ఞం చేసే చోటికి వచ్చి చెప్పింది. ఇదే మహాభారత కావ్యానికి బీజం. దుర్యోధనాదుల దుర్వ్యవహారం, దుర్నీతి చివరకు కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. ఉదంకుని విషయంలో తక్షకుడు చేసింది అదే. ఆ విషయాన్ని జనమేయునికి చాల తెలివిగా, ముందు అతడిని కీర్తించి, అసలు విషయాన్ని బయటపెట్టాడు.
మితహితసత్య వాక్యాలు నన్నయకు కూడ ప్రియమైనవని, అతని రచనలో ఇవి కనిపిస్తాయని పెద్దలు, విమర్శకులు విశ్లేషణ చేశారు.
ఈ ప్రసిద్ధమైన పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment