' ఖాండవ మేర్చె; దేవతులు గానని యీశ్వరు గాంచె; దోర్బలో
ద్దండ మహాసుర ప్రతతి దర్ప మడంచి ప్రియం బొనర్చి
యా ఖండలు డున్న గద్దియసగంబున నుండె; మహానుభావుడీ
తం డొరు మర్త్యు జేరి యనుదాత్తత నెమ్మెయి గొల్చువా డొకో! '
పాండవులు విరటుని కొల్వులో ఆజ్ఞాతవాసం చేయడానికి సన్నద్ధులౌతున్నారు. ధర్మరాజు, భీమసేనుడు, తాము ఏమి పని చేయదలుచుకున్నారో చెప్పారు. అప్పుడు, ధర్మరాజు అర్జునుని వంక చూసి, మనసు కలత చెంది, యీ విధంగా అన్నాడు:
" ఈ అర్జునుడు ఖాండవవనాన్ని దహించాడు. దేవతలకు కూడా ప్రసన్నం చేసుకొనడానికి సాధ్యం గాని ఈశ్వరుణ్ణి ప్రసన్నుడిని చేసుకొన్నాడు. భుజబలంతో విర్రవీగుతున్న రాక్షసులను జయించి, ఇంద్రుడిని మెప్పించి, అతని అర్థాసనాన్ని అలంకరించాడు. అటువంటి మహానుభావుడు ఒక సామాన్యమైన రాజును ఆశ్రయించి దైన్యంతో యే విధంగా సేవిస్తాడో కదా! "
ఈ పద్యంలో, ధర్మరాజు తన తమ్ముడు అర్జునుడిని మహానుభావుడిగా భావించాడు. అర్జునుని మహానుభావునిగా భావించటానికి ధర్మరాజుకి కనిపించిన కారణాలేమిటి?
మొదటిది, ఖాండవదహనము. అగ్నిమాంద్యం వ్యాధితో బాధపడుతున్న అగ్నిదేవుని కోరిక మీద దివ్యౌషధాలతో అలరారుతున్న ఖాండవవనాన్ని దహించి, అతని నుండి గాడీవం, దివ్యరథాన్ని పొందాడు. రెండవది, ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్రాన్ని పొందాడు. మూడవది, దేవతలకు అలవిగాని నివాతకవచులు అనే రాక్షసులను సంహరించాడు. నాలుగవది, శీలపరీక్షలో నెగ్గి, ఇంద్రుని సింహాసనాన్ని అతనితో పంచుకున్నాడు.
ఇన్ని హేతువులచేత, అర్జునుడు దివ్యుడని, మహానుభావుడని అర్థమౌతుంది. అంతటివాడు, విధివశం చేత, ఒక సామాన్యమైన రాజును సేవించవలసి వస్తున్నదని ధర్మరాజు నిర్వేదం. మహానుభావుడైన అర్జునుని అనుదాత్తత, అనగా, దైన్యము ధర్మరాజునకు భరింపరానిదయింది.
నరనారాయణులలో ఒకడైన అర్జునుని మహానుభావుతను తిక్కనసోమయాజి విరాటపర్వం ప్రథమాశ్వాసంలో చక్కగా వివరించాడు.
No comments:
Post a Comment