సంతతంబును గృష్ణసంకీర్తనంబులు
వీనుల కింపుగ వినగ వలయు
హర్షంబు తోడుత హరినామకథనంబు
పాటల నాటల బరగ వలయు
నారాయణుని దివ్యనామాక్షరంబులు
హృద్వీథి సతతంబు నెన్నవలయు
గంజాక్షులీలలు కాంతారముల నైన
భక్తియుక్తంబుగా బాడవలయు
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయమని యెఱుగవలయు
భేదమొనరింప వలవదు మేదినీశ!
" చెవులకు ఇంపు కలిగించేటట్లు ఎప్పుడూ కృష్ణుని కథలు వింటూ ఉండాలి. హరినామ సంకీర్తనం సంతోషంగా చేస్తూ ఆడుతూ పాడుతూ ఉండాలి. నారాయణుని దివ్యమైన నామాక్షరాలు హృదయంలో నిలుపుకొని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని లీలలను అడవుల్లో వెళ్తున్నా చక్కగా భక్తియుక్తంగా పాడుతూ ఉండాలి. విశ్వమయుడిని కీర్తిస్తూ, పిచ్చివాని లాగా ప్రపంచానికి అంటీ అంటకుండా ఉండాలి. ఈ జగత్తు విష్ణుమయమని తెలుసుకోవాలి. భేదబుద్ధి లేకుండా మసలుకోవాలి. "
స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి ఆగ్నీధ్రుడు, ఆగ్నీధ్రునకు, నాభి, నాభికి నారాయణాంశతో ఋషభుడు పుట్టారు. ఋషభునకు వంద మంది పుత్రసంతానం. అందులో మహానుభావుడైన భరతుడు పెద్దవాడు. అతని పేరనే మన దేశానికి భరతవర్షము అనే పేరొచ్చింది. ఋషభుని సంతానంలో, తొమ్మిది మంది నవద్వీపాలకు అధిపతులయ్యారు. ఎనభైఒక్క మంది నిష్ఠాపరులై బ్రాహ్మణత్వాన్ని స్వీకరించారు. తొమ్మిదిమంది ఋషులై, వేదాంతజ్ఞానంతో, ఆత్మతత్త్వాన్ని తెలుసుకుంటూ, ముక్తిమార్గాన్ని అన్వేషిస్తూ, ముల్లోకాలు పరమాత్మ స్వరూపంగా భావిస్తూ, తిరుగుతున్నారు. ఆ తొమ్మిది మందిలో, కవి అనే జ్ఞాని విదేహుడు అనే రాజుకి బ్రహ్మవిద్యాజ్ఞానాన్ని వివరించాడు అని శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు తెలిపాడు.
ఈ పద్యం వెలిగందల నారయ పూరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, ఏకాదశ స్కంధము లోనిది.
No comments:
Post a Comment