ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజ మన్పురంబు గాం
చిరి నవసౌరభప్రసవచిత్రవనావళి గల్గుదాని నె
వ్వారికి దురాసదంబు లగు వజ్రమయోన్నతవప్రచారు గో
పురముల దాని నయ్యలక బోలెడుదాని మహార్థసంపదన్.
గొప్ప గొప్ప మేడల వరుసలతో, క్రొత్త వాసనలు వెదజల్లే పూలతోటలతో, ఎవరికీ ప్రవేశించడానికి వీలుకాని ఎత్తైన, వజ్రమయమైన ప్రాకారాలతో, అందమైన గోపురాలతో, అంతులేని ధనసంపదతో అలకాపురాన్ని పోలినదానిని, గిరివ్రజమనే నగరాన్ని, శ్రీకృష్ణభీమార్జునులు చూసారు.
గిరివ్రజం మగధరాజు జరాసంధుని రాజధాని. గోరథం, ఋషభం, వైహారం, ఋషిగిరి, చైత్రకాద్రి అనే పర్వతాలు యీ నగరం చుట్టూ రక్షణ కవచంలా, శత్రుదుర్భేద్యంగా ఉంటాయి.
వర్ణనలలో " దాని, దాని " అని వాడటం నన్నయగారి పద్యాలలో కనిపిస్తుంది.
శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వము, ప్రథమాశ్వాసము లోని యీ పద్యంలో వృత్యనుప్రాసం వాడారు నన్నయగారు.
No comments:
Post a Comment