అది యొక్క డేల? కౌరవ చయంబు జయాశ యడంగి ప్రోవ బె
ట్టిదు డగు భీమసేనుడు గడింది మగంటిమి దుస్ససేను దు
ర్మద మడగించి పేరురము వ్రచ్చి మహోగ్రత ద్రావె నెత్తు ర
య్యది దుది నింత పుట్టునని యాప్తజనంబులు మున్న చెప్పరే?
సంజయుడు దుఃఖాతిశయంతో కర్ణుని మరణం గురించి ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు.
" కౌరవులకు గెలుపు మీద ఆశ నశించడానికి కర్ణుని మరణం ఒక్కటే కారణం అని అనుకోవడం దేనికి? మహోగ్రరూపం దాల్చిన భీమసేనుడు, దుశ్శాసనుని పొగరణగించి, అతని ఱొమ్ము చీల్చి జుగుప్సాకరంగా నెత్తురు త్రాగడం కూడ ఒక కారణం. ఇటువంటి ఆపద ముంచుకు వస్తుందని ఆప్తులు చెప్పనే చెప్పారు కదా! "
ఈ పద్యంలో దేహ దీపళీ న్యాయంగా, ముందు వెనుక వాక్యాలకన్వయించేటట్లు, వాక్యాలను వాక్యాంశాలను ప్రయోగించడం తిక్కనగారి రచనా శిల్పానికి ఒక చక్కని ఉదాహరణ. దేహ దీపళీ న్యాయమంటే, రెండు గదుల మధ్య గడప మీద పెట్టిన దీపం, రెండు గదుల లోనికి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అదేవిధంగా, రెండు వాక్యాలు, వాక్యాంశాల మధ్య వాడిన వాక్యాలు, ఆ రెండు వాక్యాలను, వాక్యాంశాలను ప్రభావితం చేస్తాయి. ఇటువంటి ప్రయోగం, ఈ పద్యంలో రెండు చోట్ల చేయబడ్డది.
ఈ పద్యం మొదటి పాదంలో, " కౌరవ చయంబు జయాశ యడంగి ప్రోవ " అనే వాక్యం ప్రయోగించారు తిక్కనగారు. కౌరవుల జయాశ నశించడానికి, కర్ణుని మరణం ఒక్కటే కారణం అని అనుకొనడమెందుకు అని, మహోగ్రరూపం దాల్చిన భీమసేనుడు, దుశ్శాసనుని ఱొమ్ము చీల్చి నెత్తురు త్రాగడం కూడా కారణం అని అన్వయించుకోవచ్చును.
రెండవది, " అయ్యది " అనే ప్రయోగం. దీనిని నెత్తురు అనే పదానికి అన్వయించుకుంటే, ద్రౌపదిని పరాభవించే మదం కలిగిన నెత్తురిని అని చెప్పుకొనవచ్చును. అట్లా కాకుండా, అయ్య+ది అని విడదీస్తే, యువరాజు దుశ్శాసనునిదైన (అయ్యదైన) నెత్తురు అని చెప్పుకొనవచ్చును. శ్రీనాథ కవిసార్వభౌముడు కూడా " సోమరిపోతులు కొందరయ్యలు " అని ప్రయోగం చేశారు. కావున, ద్రౌపదిని పరాభవించిన అయ్యది అనీ, ఆప్తులు చెప్పిన హితవాక్యాలను పెడచెవినిబెట్టిన అయ్యది అనీ అన్వయించవచ్చును.
తిక్కన భారతము కర్ణపర్వము ప్రథమాశ్వాసము నందలి యీ పద్య విశేషాంశాలన్నీ బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు అందించిన వ్యాఖ్యాన సారాంశమని, దానిని మీతో పంచుకొనడమే నేను చేసినదని, సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
No comments:
Post a Comment