ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్,
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటుమృత్యురోగభయశంకం బొంద మే మెన్నడున్.
పూర్వం హైహయవంశానికి చెందిన దుందుమారుడనే రాజకుమారుడు జింకచర్మాన్ని ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ, పొదలమాటున ఉన్న ఒక బ్రాహ్మణ బాలుడిని, జింకగా తలచి, బాణం వేసి చంపాడు. తరువాత పొరపాటు తెలుసుకొని ఆ విషయం పెద్దవారికి చెప్పాడు. దీనికి చాల బాధపడ్డ వృద్ధహైహయులు సమీపంలో ఉన్న తార్క్ష్యుని ఆశ్రమానికి వెళ్ళారు. వారందరినీ చూసి, అతిథి మర్యాద సలపడనికి సన్నాహం చేస్తున్న మహర్షిని చూసి, తామందుకు తగినవారము కామని, జరిగినదంతా సవిస్తరంగా చెప్పారు. అంతా విన్న తార్క్ష్యుడు మరణించాడని వారనుకొంటున్న బ్రాహ్మణ బాలుడిని వారికి చూపించాడు. ఆశ్చర్యచకితులైన వారందరికీ, ఆ ఆశ్రమవాసులకు భయం, రోగం, చావు, చెరలో ఉంచబడటం వంటి బాధలు ఉండవని, దానికి కారణాలను వివరించాడు.
ఆ ఆశ్రమంలో వారెన్నడూ సమయాన్ని దుర్వినియోగం చేయరు. పరిశుభ్రమైన ఆహారం భుజిస్తారు. అతిథి, అభ్యాగతులను పూజిస్తారు. సత్యవాక్పరిపాలన చేస్తారు. శాంతి, బ్రహ్మచర్యం అనుష్ఠానం చేస్తారు. ఈ నియమాలన్నీ పాటించడం వల్ల, ఆశ్రమవాసులకు, మృత్యు, వ్యాధి భయాలు లేవు. అందువల్ల, వారికి ఎటువంటి భయాందోళనలు లేవు.
పూర్వకాలం, భారతదేశంలో పాటించబడిన యీ నియమాలు వర్తమాన సమాజంలో అందరూ పాటిస్తే, సంతోషానికి, ఆనందానికి నిలయమైన నవభారతదేశం నిర్మాణమౌతుంది.
ఎఱ్ఱన భారతము అరణ్యపర్వశేషం లోని యీ పద్యం అందరూ మననం చేసి, అందులోని నియమాలను ఆచరణలో పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment