నకనక లాడునట్టి కడుపులన్ వచ్చి త్రేచుచు బోయెడు తెరువరులును
చినిగిన గుడ్డల జనుదెంచి నూతన పరిధానముల దాల్చి యరుగు జనులు
పరిదీనవదనులై యరుదెంచి యుత్సాహ కృతమందహాసులై యేగువారు
సందేహ భాజనాస్యములతో వచ్చి యాశ్చర్యసూచి ముఖాల జనెడువారు
బొలుతు రన్నాతురులు యాచకులును నిత్య
కలిత బహుళ కార్యాంతరాగతులు విశ్వ
నాథ వంశాబ్ధి శశి శోభనాద్రియింట
నిరులు వదలి వెలుతురులు గొంచేగునట్లు.
కొందరికి సందేహం రావచ్చు. ఎందుకు యీ పద్యానికి వ్యాఖ్య వ్రాస్తున్నాడా అని. దానికి సమాధాన మొక్కటే. ఆనందం పట్టలేక అని. " ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని " కవి వ్రాసిన రాతలు వేరే సందర్భానివయినా, కవి హృదయం మాత్రం ఆ సందర్భపు టెల్లలను దాటుతుంది. దాతకే దానగుణ మాధుర్యం తెలుస్తుంది. దాన మనేది తెలిసి చేసేది కాదు, తెలియనీయకుండా చేయించేది. ఆపుకుందామనుకున్నా ఆగని ఆవేశమది.
పద్యానికి అర్థం చెప్పడం ఇక్కడ ముఖ్యం కాదు. ఆ పద్యం వెనుక నున్న విశ్వనాథ వంశాబ్ధి శశి, శోభనాద్రిగారు, ఆ చల్లని వెన్నెలను కురిపించడమనే గుణాన్ని వంశపారంపర్యంగా విశ్వనాథవారికి సంక్రమింప చేసారని, ఆయనతో దగ్గరగా మెలిగినవారికి, అనుయాయులకు, ఆప్తులకు, శిష్యులకు, నా వంటి ఏకలవ్య శిష్యులకు, వారి ఆత్మకథ చదివిన వారికి తెలుసు.
ఈ సందర్భంగా, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పద్యం గుర్తుకొస్తుంది.
సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
అంతే!
ముఖ్యంగా, గీతం లోని చివరి పాదం - ఇరులు వదలి వెలుతురులు గొంచేగునట్లు - పద్యం మొత్తాన్ని ప్రకాశవంతం చేసింది.
ఇంత మంచి పద్యం మీకు ఎక్కడ దొరికిందని అడగండి. శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోనిది యీ పద్యం. కల్పవృక్షావతారిక ప్రతిపద్యసుందరం.
No comments:
Post a Comment