భయరోగార్తిమహాఘరౌతుచయమున్ బాయున్ ముదంబొందు ని
ర్భయకళ్యాణసుశాంతి సంపద సుఖప్రాప్తుండగున్ దుఃఖసం
క్షయమై కర్మనిబంధానాపహరమై సౌఖ్యాత్ముడై ముక్తుడౌ
దయ నీవెవ్వనిజూతు వాడు భువిలో దారిద్ర్యవిద్రావణా!
బృహస్పతికృత దారిద్ర్యవిద్రావణ స్తవంలో మూడవ పద్యం ఇది.
" దారిద్ర్యాన్ని పారద్రోలే ఈశ్వరా! నీవు ఎవరినైతే దయతో చూస్తావో, వాడు భయం, రోగం, బాధ, గొప్ప పీడల బారిన పడకుండా ఉంటాడు. సంతోషాన్ని పొందుతాడు. భయం లేని స్థితిని, శుభాన్ని, శాంతిని , సుఖసంపదలను పొందుతాడు. దుఃఖం తొలగిపోయి, కర్మబంధాలు తెగిపోయి, ఆనందాన్ని, ముక్తిని పొందుతాడు. "
మనిషి చేసిన పనులే, అతడిని భయం, వ్యాధి, బాధ, పీడలు అనేటటువంటి కర్మఫలితాల రూపంలో వెంటాడుతాయి. అందువల్ల, వీటి నుండి విముక్తుడై కర్మబంధాలను త్రెంచి వేసికోవాలంటే, శివుని (భగవంతుని) శరణు పొంది, ఆయన దయకు పాత్రుడవటం తప్ప వేరే దారి లేదు. పైన చెప్పిన దుఃఖాన్ని కలిగించే వాటినుండి బయటపడడమే, సుఖాన్ని పొందడమంటే. దానినే ఆనందసిద్ధి, మోక్షము అంటారు.
భయం, ఆర్తి, ఆతురత - ఇవన్నీ జంతు లక్షణాలు. ఇవి పోతే మనిషికి సుఖప్రాప్తి కలుగుతుంది.
ఈ పద్యం నన్నెచోడుని కుమారసంభవము, దశమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment