అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో?
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
" మిన్నుల మ్రోతలే నిజము మే " లని చంపకు మన్న మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమస్కంధము లోని యీ పద్యం చాల ప్రసిద్ధమైనది.
కంసుడు, నూతన వధూవరులయిన దేవకీవసుదేవులను స్వయంగా తానే రథం నడపుతూ తీసుకువెళ్తున్నాడు. హఠాత్తుగా అశరీరవాణి దేవకి అష్టమ గర్భంలో పుట్టినవాడి చేతిలో కంసుడికి మరణం సంభవిస్తుందని పలికింది. ఈ మాటలు విని భయకంపితుడైన కంసుడు దేవకిని చంపబూనుతాడు. అప్పుడు కంసుడిని వసుదేవుడు వేడుకొంటున్న ఘట్టమిది.
" బావా! దేవకికి నీవు అన్నగారివి కదా! చెల్లెలు మీద ప్రేమతో, ఆమెకు ధనమో, చీరలో , లేకపోతే ఆమెతో నాలుగు మంచిమాటలు మాట్లాడటమో సబబు కానీ, ఈ విధంగా గాలిలో వచ్చిన మాటలు నిజమని నమ్మి, ఇంటి ఆడపడుచుని చంపబూనటం ఏ మాత్రం సమంజసం కాదు. నా మాట విని నిదానంగా ఆలోచించు. నాయనా! నీ ప్రయత్నం మానుకో. "
ఈ పద్యంలో పలుమార్లు , " అన్న, అన్న " , అని వాడటం వల్ల, వసుదేవుడు తన బావను ఏ విధంగా బ్రతిమాలుకుంటున్నాడో తెలుస్తుంది. ఇప్పటికీ, సమస్త తీవ్రతను బట్టి యీ విధంగా వేడుకోవడం తెలుగు ప్రాంతాలలో చూస్తుంటాము.
No comments:
Post a Comment