విను పిచ్చుకకుం టతిరయ
మున బోకకు బడుట, పేద ముదుకడు వేశ్యా
జనముం గోరుట దుర్యో
ధను డింక జయంబు గొనగ దలచుట యరయన్.
మనలో గయ్యం బేటికి
నని ధర్మసుతుండు సెప్పె నది మీ పతి గై
కొన డయ్యె రోగి పథ్యా
శనమునకుం జొరని భంగి సంజయ! యెట్లున్.
భీష్మ, ద్రోణ, కర్ణులు యుద్ధరంగంలో కూలిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు విచారంలో మునిగిపోయాడు.
దుర్యోధనుడు, కర్ణుడి మరణానంతరం కూడ యుద్దంలో గెలుస్తాననుకోవడం, కుంటివాడు వేగంగా నడవాలనుకోవడం, పేదవాడైన వృద్ధుడు, వేశ్యల పొందు కోరటం వంటిదని ధృతరాష్ట్రుని అభిప్రాయం. కుంటివాడు నడవటమే కష్టమనుకుంటే, వేగంగా నడవటం ఎంత కష్టం. అలాగే, పేదవానికి వేశ్యతో సంగమం వీలుకానిది. అటువంటిది, వృద్ధునికి వేశ్యలతో పొందు సాధ్యమా? అనగా, వ్యర్థ ప్రయత్నమని అర్థం.
పిచ్చుకకుంటు= కుంటివాడు
అంతేగాకుండా, అన్నదమ్ముల బిడ్డలయిన తాము (పాండుకుమారులు, ధార్తరాష్ట్రులు), కలహంచుకోవడం తగదని ధర్మరాజు చెప్పాడని, కానీ, రోగికి పథ్యం రుచించనట్లు, ఆ మాటలు దుర్యోధనుడికి సమ్మతంగా లేవని ధృతరాష్ట్రుడు సంజయుని వద్ద తన గోడును వెల్లబోసుకొన్నాడు.
ఈ సందర్భంలో, రెండవ పద్యానికి కీ.శే.ఏలూరిపాటి అనంతరామయ్యగారి వ్యాఖ్యానం తెలుసుకోదగ్గది.
ధృతరాష్ట్రుడు యుథిష్ఠురుని ' ధర్మసుతుడు ' అని అనడం మూలంగా, ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజు అంశతో జన్మించిన ధర్మరాజు, ధర్మ సమ్మతంగా మాట్లాడాడని ధృతరాష్ట్రుని మనస్సుకి తెలుసు. అదే విధంగా, " మీ పతి గైకొనడు " అని తన కొడుకుని గురించి మాట్లాడడం తిక్కనగారి లోక పరిశీలనాదృష్టికి నిదర్శనం. మనకు ఎవరైనా నచ్చితే, మనవాడు అనడం, నచ్చకపోతే, మీవాడు అనడం లోకంలో పరిపాటి. అందువల్లనే, దుర్యోధనుడు తన కొడుకే అయినప్పటికీ, కొడుకు దుశ్చర్యలు నచ్చకపోవడం వల్ల, సంజయునితో " మీ పతి గైకొనడు " అని అన్నాడు.
అట్లాగే, దుర్యోధనుడిని రోగితో పోల్చడం చాలా మనోహరంగా ఉంది. రోగి తినకూడనివి తినటమూ, తినవలసినవి తినకపోవడమూ, కీడు చేస్తుంది. అదే దుర్యోధనుడు చేసింది. మంచి మాటలు పెడచెవిన పెట్టాడు, చెడు మాటలు విని చెడిపోయాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము, కర్ణపర్వము, ప్రథమాశ్వాసములోని యీ రెండు పద్యాలు, నన్నయగారి " నానారుచిరార్థసూక్తి నిధిత్వం " వలెనే, తిక్కనగారి సూక్తిముక్తావళికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
No comments:
Post a Comment