అమ్మెయి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లే
దమ్మహనీయ యుద్ధమున కాత్మయ తోడు, మనంబు శత్రు డీ
వెమ్మెయినైన శాంతి ఘటియింపుము లోపగ దీర్పు మెందు శాం
తమ్మ చుమీ మనోజయము దాన వెలుంగుము శాంతబుద్ధివై.
శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వము, ప్రథమాశ్వాసములోని ఈ పద్యము అద్భుతమైనది.
రాజ్యం కోసం బంధుమిత్రులను కురుక్షేత్రసంగ్రామలో చంపవలసివచ్చిందని చింతాక్రాంతుడై ఉన్న ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తత్త్వబోధ చేస్తున్నాడు.
కురుక్షేత్ర సంగ్రామం మిథ్యాయుద్ధమని, అది నిజమైన యుద్ధం కాదని చెప్పి శ్రీకృష్ణుడు దానికి వివరణ ఇస్తున్నాడు.
" నీవు భావిస్తున్నట్లుగా, అంత మంది బంధుమిత్రులను కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకనగా, మానవునికి తన ఆత్మ అన్నదే తోడు, మనస్సనేది శత్రువు. అందువల్ల, నీవు బాహ్య శత్రువులను చంపావని బాధపడతావెందుకు? నీ లోపలి శత్రువులను జయించి, మనస్సుకు శాంతిని తెచ్చుకో. మనస్సును జయించడమంటే యేమిటి? శాంతంగా ఉండటమే కదా! అందువల్ల, శాంతబుద్ధితో ఉండడానికి అభ్యాసం చేయి. "
ఈ సందర్భంగా, ఈ పద్యాన్ని అర్థం చేసుకొనడానికి,తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వము, ప్రథమాశ్వాసానికి డా.హెచ్.ఎస్.బ్రహ్మానందగారి విశేష వ్యాఖ్య కూడ ఎంతో ఉపయోగపడుతుంది.
కౌరవులు పాండవులు లోకం దృష్టిలో శత్రువులు. అందువల్ల యుద్ధం చేశారు. జయాపజయాలను ప్రక్కన పెడితే, ఎవరి అంతఃశ్శత్రువులు వారికున్నారు. దుర్యోధనునికి లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ శత్రువులు. ఇక పాండవులకు, రాజ్యకాంక్ష, తమ పరాక్రమంపై నమ్మకం, కౌరవులపై పగ శత్రువులు. అటు కౌరవులు తమ ద్వేషానికి తామే బలైపోయి, అశాంతితో మరణించారు. గెలిచిన పాండవులు, మనశ్శాంతి లేక శోకంతో కుమిలిపోతున్నారు. శ్రుతివాక్యం వలె " మనయేవ కారణం బంధ మోక్షామి ఏవచ ". ఈ శోకానికి కారణం మనస్సు. ఈ శోకానికి కారణం ఆత్మనిత్యత్త్వాన్ని తెలుసుకొనకపోవడం. ఈ శోకానికి కారణం తమోగుణం, అజ్ఞానం. అందువల్లనే, వివేకంతో శాంతబుద్ధిని అభ్యసించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు హితవు పలికాడు.
No comments:
Post a Comment