శత్రుల నాజి నోర్చుటయు, సర్వ భయంబుల బొందకుండగా
ధాత్రి బరిగ్రహించి యుచితస్థితి గాచుటయుం, బ్రియంబుతో
బాత్రుల కర్థ మీగియును, బ్రాహ్మణ పూజయు జువ్వె! యుత్తమ
క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. ఇదంతా, ధర్మం తప్ప కూడదన్న, అన్నగారైన యుథిష్ఠురుని, అడుగుజాడల్లో జరుగుతున్నది. అయితే, భీముడు మాత్రం, ధర్మమనే పేరుతో, అర్థకామాలను అలక్ష్యం చేయకూడదని, త్రివర్గాల సమతూకాన్ని గురించి వివరించాడు.
ఈ పద్యంలో, క్షత్రియ ధర్మాలను గురించి చెప్పాడు భీముడు. శత్రువులను యుద్ధంలో ఓడించటం, ప్రజలు భయాలు, బాధలు పొందకుండా, చక్కగా రాజ్యపాలన చేయడం, అర్హులైన వారికి ప్రేమతో దాన మివ్వడం, బ్రాహ్మణులను పూజించడం, ఉత్తమ క్షత్రియ గుణాలని చెప్పాడు. ఈ క్షత్రియగుణాలు ఉత్తమగతులను, అన్ని సంపదలను పొందటానికి కారణమౌతాయి.
ఈ పద్యం నన్నయ భారతము, అరణ్యపర్వము, ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment