కమనీయాకృతి యోగ్యకీర్తనములం గన్పట్టు నా శ్యామ యా
సుమబాణాంబక యాయమూల్యమణి యాచొక్కంపుపూబంతి యా
సుమనోవల్లరి యా సుధాసరసి యా సొంపొందుడాల్దీవి యా
కొమరుంబ్రాయపురంభ యాచిగురుటాకుంబోడి నీకే తగున్.
కొన్ని పద్యాలు చదువుతున్నప్పుడు, పద్యంలోని అక్షరరమ్యత, పదబంధాలు మనసుని ఆకట్టుకొని, మనను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అంటువంటిదే రామరాజభూషణుని వసుచరిత్రము, ద్వితీయాశ్వాసము నందలి యీ పద్యము.
సుందరమయిన అవయవ యోగ్య కీర్తనముల చేత కనపడుతూ, నల్లని జడ కలిగిన, మన్మథుని పూబాణముల వంటి కన్నులు గల, పద్మరాగమణుల వంటి అధరములు గల, సుందరమయిన పూబంతుల వంటి కుచములు గల, పూదీగెల వంటి బాహువులు గల, అమృతసరస్సు వంటి నాభి కల, చక్కని కాంతిని విరజిమ్మే ఇసుకతిన్నెల వంటి పిఱుదులు కల, తరుణ వయస్సు కల అరటిబోదెల వంటి తొడలు కల, చిగురుటాకు వంటి మృదుత్వం కల, గిరికాదేవికి తగినవాడు, వసురాజు మాత్రమే అని కేళీసచివుడు అన్నాడు.
ఈ పద్యంలో ఉపమానాలుగా చూపబడిన కన్నులు మొదలు, పిఱుదులు వరకు గల అవయవములు, ఉపమేయమయిన స్త్రీకి లక్షితంగా ఉన్నాయి.
ముఖ్యంగా, ఆ శ్యామ, ఆ సుమబాణాంబక, అ అమూల్యమణి, ఆ చొక్కంపుపూబంతి, ఆ సుమనోవల్లరి, ఆ సుధాసరసి, ఆ సొంపొందుడాల్దీవి, ఆ కొమరుంబ్రాయపు రంభ, వంటి పదబంధాలు, ' ఆ ' అనే దీర్ఘాక్షర పునరావృత్తి చేత, గిరికాదేవి అవయవముల పొంకము, వానికి లక్ష్యమైన ఆమె యందు పర్యవసించి, పద్యానికి విలక్షణమైన శోభను తెస్తున్నది. ఇక్కడ అవయవములను బట్టి, అవయవములు కలిగిన స్త్రీకి కమనీయాకృతి యోగ్య కీర్తనములు పేర్కొనబడ్డాయి.
మొత్తం మీద, ఈ చక్కదనాల చుక్క నీకు దక్కటమే భావ్యమని చెప్పాడు వసురాజు సఖుడు.
No comments:
Post a Comment