తగ బర్జన్యుని సొంపునన్ బ్రతుకు భూతవ్రాతముల్, వార్థి సొ
చ్చి గరిష్ఠస్థితి నుండు నేఱులును, సంక్షీణంబులై యుర్వి ని
ల్చి గుణాధిక్యము బొందు బీజములు బోలెం గౌరవుల్ విశ్రుతం
బగు నీప్రోపును బ్రాపు గాపు గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్.
అరయగ బంధుకోటులకు నక్కురునాథుని యట్లకావె, నీ
వరికులభేది! జన్మమున నయ్యెడు చుట్టఱికంబు కంటె సు
స్థిరతరమైన సంగడము చే నగు బాంధవ మెక్కుడండ్రు రా
నరపతి రాజ్యభారము మనంబున నీయదిగా దలుంపుమీ!
అంపశయ్య మీద నున్న భీష్ముడిని చూడటానికి కర్ణుడు యుద్ధరంగానికి వచ్చాడు. కురునాథుని పక్షాన పోరాడటానికి అనుజ్ఞ ఇచ్చి ఆశీర్వదించమని అడిగిన కర్ణునితో భీష్ముడు యిట్లా అన్నాడు.
" వానలు విస్తారంగా కురవడం వల్ల ప్రాణికోటి రక్షింపబడినట్లు, నదులు సముద్రాన్ని చేరి అత్యున్నతస్థితి పొందినట్లు, , విత్తనాలు బాగా ఎండిపోయి భూమిలో ఉండటం వల్ల వృద్ధిపొందినట్లు, కౌరవసేన నీ రక్షణలో సౌఖ్యాన్ని పొందటం , ఎంతైనా చక్కగా ఉంది. అంతేగాక, ఇక్కడ ఉన్న బంధువర్గానికంతా నీవు కూడా దుర్యోధనుని వంటి వాడవే కదా! పుట్టుకతో వచ్చే చుట్టఱికం కంటె, ఆత్మీయతతో కూడిన దృఢమైన స్నేహబంధమే గొప్పదని పెద్దలు చెబుతారు. అందువల్ల, కురునాథుని రాజ్యరక్షణభారం నీపైన ఎక్కువగా ఉంది. అది తెలుసుకో. "
పై రెండు పద్యాల లోని భీష్ముని మాటలు కరుణ రసాన్ని కురిపిస్తూ, ఆంతరంగా అతనికి కర్ణునిపై గల వాత్సల్యాన్ని తెలియజేస్తూ, అదే సమయంలో అతని కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.
ఈ రెండు పద్యాలు తిక్కన భారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసములో ఉన్నాయి.
No comments:
Post a Comment