సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్
బాలార్కప్రతిభున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘను గర్ణాఖ్యున్ జగత్కర్ణపూ
ర్ణాలోలద్గుణు జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్.
కుమారాస్త్రవిద్యాప్రదర్శనం సందర్భంగా, పాండవమధ్యముడైన అర్జునుని శస్త్రాస్త్ర విద్యాప్రదర్శన జరుగుతున్నది. ఇంతలో, ప్రదర్శన తిలకిస్తున్న వారికి, ఎడతెరిపి లేకుండా, భుజం చరుస్తున్న శబ్దం వినిపించింది. అది పర్వతసమూహాలను ఛేదిస్తున్న వజ్రాయుధం ధ్వనిలాగ ఉన్నది. అందరూ అటువైపు చూసారు. అక్కడ,
మద్దిచెట్టు వలె పొడవైన వాడు, సహజ కవచకుండాలతో వెలిగిపోతున్నవాడు, బాలసూర్యుని వంటివాడు, ధనుస్సును ధరించినవాడు, ప్రక్కన ఖడ్గం వ్రేలాడుతున్నవాడు, శౌర్యమే అలంకారంగా కలవాడు, లోకం యొక్క చెవులలో నిండి వ్యాపిస్తున్న గుణాలు కలవాడు ఒకడు కనిపించాడు.
అతడు, కర్ణుడనే పేరు కలవాడు.
అర్జునుని వర్ణనకు సంబంధించిన పద్యానికి దీటుగా ఆదిపర్వము, షష్ఠాశ్వాసములో యీ పద్యం రచించారు నన్నయగారు. దీనిని బట్టి, రాబోయే కథలో కర్ణుని ప్రాధాన్యత యేమిటో, " కర్ణుడు లేని భారతం లేదు " అన్న నానుడిలో సహేతుకత యేమిటో మనకు అర్థమవుతుంది.
సాలము అంటే మద్దిచెట్టు . నిస్త్రింశము అంటే కత్తి, కనికరము లేనిది.
No comments:
Post a Comment