కురుకులజుండు పాండునకు గుంతికి బుత్రుడు, రాజధర్మబం
ధురచరితుండు; నీ వతనితోడ రణం బొనరించెదేని వి
స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పినన్
దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్.
కుమారాస్త్ర విద్యాప్రదర్శన జరుగుతుండగా, కర్ణుడు రంగ ప్రవేశం చేసి తన శస్త్రాస్త్ర విద్యను ప్రదర్శించాడు. దుర్యోధనుని ప్రోత్సాహం లభించగానే, అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు, కృపాచార్యుడు కర్ణునితో ఈ విధంగా అన్నాడు.
" ఈ అర్జునుడు కురుకులంలో పుట్టినవాడు, పాండురాజు కుంతీదేవి కుమారుడు. రాజధర్మం చేత ఒప్పిన ప్రవర్తన కలవాడు. ఇప్పుడు నీవు ఇతనితో యుద్ధం చేయదలచుకుంటే, నీ వంశం గురించి, తల్లిదండ్రులను గురించి చెప్పు. అప్పుడు, (పైన చెప్పిన విధంగా) నీవు సమానుడవైతే, ఇతడు నీకు ఎదురునిలిచి భుజబలాన్ని ప్రదర్శిస్తాడు. "
పద్యం చాలా తేలికగా అర్థమవుతుంది. కానీ, పై పైన అర్థం చేసుకుంటే, పద్యం సొగసు తెలియదు. మహాకవుల లక్షణ మంతే. " లోనారసి మేలు " అనాలి.
అందువల్ల, పెద్దలు చెప్పిన దానినే, నాకు అర్థమయిన రీతిలో వివరిస్తాను.
శబ్దం యొక్క శక్తి అమోఘమైంది. అది అడుగున దాగి ఉన్న ప్రాణభూతమైన అర్థాన్ని బయటకు లాక్కొస్తుంది. అటువంటి శబ్దాలు ఈ పద్యంలో కృపాచార్యుడు ప్రయోగించినవి మూడు ఉన్నాయి. అవి కుల, రాజ, దొర, అనే మాటలు. కులమంటే వంశమనీ, వర్ణమనీ రెండర్థాలు ఉన్నాయి. అర్జునుడు, కురువంశానికి చెందినవాడు, క్షత్రియుడు. ఇక, రాజ్యమున్నవాడు రాజు, క్షత్రియుడు అని కూడ అర్థం. వంశాన్ని, తలిదండ్రులను పేర్కొని, కర్ణుడిని అర్జునునితో సమానమైన వాడిగా నిరూపించుకొనమని కృపాచార్యుడు చెప్పాడు. దొర అంటే ప్రభువు, సమానుడు అని రెండర్థాలు ఉన్నాయి. దొర అన్న పదానికి ప్రభువు అన్న అర్థాన్ని తీసుకొని, దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడు. పరాక్రమంలో, కర్ణుడు అర్జునునకు సమానుడని సూచించాడు. పరాక్రమం ప్రసక్తి వచ్చినప్పుడు, తల్లిదండ్రులను, కులాన్ని పట్టించుకొనగూడదని వాదించాడు. అందుకే, భీముణ్ణి ' అనిలజుడు ' అని ఎత్తిపొడిచాడు.
పద్యంలోని సొగసంతా ' దొర ' అన్న శబ్దంలోని వాచ్యార్థ, వ్యంగ్యార్థాల్లో ఉంది. వాచ్యార్థ మంటే పైకి కనపడే అర్థం. వాచ్యార్థంలో కర్ణుడు అర్జునునికి సమానుడైతే కావచ్చు గాని, వ్యంగ్యార్థంలో, తల్లి దండ్రుల నుంచి సంక్రమించే గౌరవం, ఉత్తమ కులగౌరవం ఎన్నటీకీ లభించవని కృపాచార్యుని భావన. ఈ విధంగా, కృపాచార్యుని చేత వాడబడిన శబ్దగత ధ్వని సౌరభం, ఈ పద్యాన్ని గుబాళింపజేసింది. ఈ సందర్భంగా, " దొర యగుదేని " అన్న కృపాచార్యుని మాటల పొందిక కూడా గమనార్హం.
పద్యం చదివే వారికి కర్ణుని జన్మవృత్తాంతం తెలుసు, కానీ, ఆ సన్నివేశంలో ఉన్నవారికి అది తెలియదు. అందువల్ల, చదివేవారికి కర్ణుడి పట్ల సానుభూతి కలుగుతుంది. ఇది రస విషయకమైన పరమ రహస్యం.
ఇందులో చెప్పబడిన అంశములన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసములో కనిపిస్తాయి. విశేష వ్యాఖ్యను డాక్టరు అప్పజోడు వేంకటసుబ్బయ్యగారు, సంపాదకవర్గము వారు అందించారు. వారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment