ఆ పురి బాయకుండు మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వరనిర్మలధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భకులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై.
ఈ పద్యంలో అల్లసాని పెద్దనగారు వాడిన విశేషణాలు సాహిత్యాభిమానులను, సంస్కృతాంధ్ర భాషాభిమానులను పులకరింపజేస్తాయి.
మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి. మకరాంకుడు మన్మథుడు. అనగా తన జండాపై మొసలి గుర్తు కలవాడు. శశాంకుడు చంద్రుడు. అనగా, కుందేలు మచ్చగా కలవాడు. ప్రవరుడనే పేరు గల బ్రాహ్మణుడు మన్మథుని వంటి, చంద్రుని వంటి ఆకారవిశేషములు కలవాడు.
భాషాపరశేషభోగి. వాక్కునకు రెండవ ఆదిశేషువు. ఆదిశేషువు అవతారమైన పతంజలి యోగశాస్త్రాన్ని రచించాడు. ప్రవరుడు అటువంటి వాడు.
వివిధాధ్వరనిర్మలధర్మకర్మదీక్షాపరతంత్రుడు. అధ్వరము అంటే యజ్ఞము. ప్రవరుడు యజ్ఞయాగాదులు చేయడంలోను, నియమనిష్ఠలను పాటించడంలోను, వాటికి లొంగిపోయినవాడు. అనగా యజ్ఞయాగాదులను చేయడంలో నిమగ్నమైనవాడు.
అంబురుహగర్భకులాభరణంబు. అంబురుహగర్భుడు అంటే పద్మము నందు పుట్టినవాడు. విష్ణువు నాభికమలంలో పుట్టినవాడు బ్రహ్మ. బ్రహ్మకులం బ్రాహ్మణ కులం. ఆ కులానికి ఆభరణం వంటి వాడు, వన్నెదెచ్చిన వాడు ప్రవరుడు.
అనారతాధ్యాపనతత్పరుండు. ఎప్పుడూ వేదాధ్యనం చేయించుట యందు ఆసక్తి కలవాడు.
అలేఖ్యతనూవిలాసుడు. అలేఖ్యము అనగా వ్రాయడానికి వీలులేనంత శరీర సౌందర్యము కలవాడు. పూర్వం చిత్రపటాలను వ్రాయడమనే వారు. అంటే చెప్పడానికి వీలులేనంత అందం ఆయన స్వంతం.
ఇన్ని గుణాలున్న ప్రవరుడు ఆ ఊరు వదలి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు.
ఇదంతా ప్రవరుని గురించి చెప్పిన పద్యం. ఈ పద్యం సొగసు దీర్ఘ సంస్కృత సమాసాల్లో ఉంది. పద్యం లోని అన్ని విశేషణాలు ఒక ఎత్తైతే, " అలేఖ్యతనూవిలాసుడై " అన్న విశేషణం ఇంకొక ఎత్తు. సాహిత్యాభిమానులు యీ పద్యాన్ని మరచిపోవడం సాధ్యమా? శాబ్దిక శ్రావ్యతకు, అలాగే, అర్థగంభీర్యానికి కూడ యీ పద్యం ఒక ఉదాహరణ.
No comments:
Post a Comment