గురుడును భీష్ముడుం జనిన గొంచెపు మూకలతోడ నేను సం
గరవిజయంబు గోరి భుజగర్వమునన్ సడిసన్న పాండుభూ
వరసుతవర్గముం దొడరువాడనకా నది నిశ్చయించు టె
వ్వరిగొని యింత నీ వెఱుగవా? నిను గర్ణుని గాదె? నమ్మితిన్.
నిజం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం లౌక్యంగా మాట్లాడాలి. అప్పుడే, అనుకున్న పని సఫలమౌతుంది. శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ప్రథమాశ్వాసం లోని ఈ పద్యం చదివితే అదే అర్థమవుతుంది.
యుద్ధభూమిలో, అర్జునుడు విజృంభించి బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ ధాటికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. దుర్యోధనుడు ఆశలన్నీ కర్ణుడి మీద పెట్టుకొన్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథి. అంతటి సారథ్యం చేయగలిగినవాడు కౌరవపక్షంలో ఒక్క శల్యుడే ఉన్నాడు. సుక్షత్రియవంశానికి చెందిన శల్యుడిని, సూతపుత్రుడైన కర్ణుడికి రథసారథ్యం చేయమని దుర్యోధనుడు శల్యుడిని నేరుగా అడగలేడు. అందుకనే, లౌక్యాన్ని ప్రదర్శించి ఈ విధంగా చెబుతున్నాడు.
" ఓ శల్య మహారాజా! భీష్మ ద్రోణులు యుద్ధంలో పడిపోయిన తరువాత, చెల్లాచెదరైపోయిన మన సేనలను సమకూర్చుకొని, పరాక్రమోపేతులైన పాండవులను దీటుగా ఎదుర్కొనడానికి నిర్ణయించుకొన్నానంటే, అది ఎవరి అండ చూసుకొని? నిన్ను, కర్ణుడిని మనసులో పెట్టుకొనే కదా! ఇది నీకు కూడా తెలుసు కదా! "
దుర్యోధనుడి రాజనీతి, లౌక్యం అంతా ఇక్కడుంది. శల్యుడు గదా యుద్ధంలో భీమ దుర్యోధను లంతటివాడు. ఇది పచ్చి నిజం. అయినా, శల్యుడు మాద్రి సోదరుడు కనుక, పాండవ పక్షపాతం తప్పకుండా ఉంటుందని దుర్యోధనుడికి తెలుసు. దుర్యోధనుడి ఆశలన్నీ కర్ణుడి మీదే పెట్టుకున్నాడు. కర్ణుడి ప్రభుభక్తి మీద దుర్యోధనుడికి నమ్మకం ఎక్కువ. అందుకే, కర్ణుడిని సర్వసేనాధిపతిని చేశాడు. అయితే, ముఖాముఖి సంభాషణలో, కర్ణుడిని ముందు చెప్పి, శల్యుడిని ద్వితీయ స్థానానికి నెడితే, అది శల్యునికి కోపకారణమౌతుంది. అందుకే తెలివిగా, " నిను గర్ణుని గాదె? నమ్మితిన్ " అని మాటల్లో మాత్రం శల్యుడికి అగ్రతాంబూలమిచ్చాడు. ఇదే రాజనీతి, లౌక్యం, కార్యసాధన అంటే.
No comments:
Post a Comment