హనుమ తా మాటలాడుచున్నంతసేపు
వ్రాల్పకయ ఱెప్ప నాతనివంక గనుచు
లక్ష్మణుడు ప్రాణముల నూర్మిళామనస్కు
డయ్యె నవిదితసర్వవృత్తాంతు డగుచు.
హనుమ తా వారి జూచుచున్నంతసేపు
నన్నదమ్ముల కన్నులయందు గనుచు
రాముకన్నుల బరమేశ్వరత్వ మనుజు
కన్నులను యోగిరాజ లక్షణము గాంచు.
హనుమంతుడు భిక్షుకుని ఆకృతితో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. చెప్పవలసినంత వరకు వినయపూర్వకంగా చెప్పాడు. వినవలసినదంతా గౌరవపురస్సరంగా విన్నాడు. హనుమను చూసిన తరువాత, అతని మృదు, మిత, సమయ భాషణం విన్న తరువాత, ఇంతటి బుద్ధివిశేషం, వినయసంపద, సాధుస్వభావం కలబోసికొన్న వానిని మంత్రిగా పొందిన కపీశ్వరుని భాగ్యం ఎంతటిదో కదా అని తలపోశాడు రాముడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లున్నదని సుగ్రీవునికి తమ మాటగా చెప్పమన్నాడు. తమను గురించి వాళ్ళ అధిపతికి ఏ సుహృద్భావమైతో ఉందో, అదే భావం వారికి కూడా ఉన్నదని లక్ష్మణుడు చెప్పమన్నాడు.
హనుమ తాను మాట్లాడుచున్నంతసేపు, ఱెప్ప వ్రాల్చకుండా లక్ష్మణుడినే చూస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు అంతర్ముఖంగా ఊర్మిళామనస్కుడయ్యాడు. తెలియకుండానే, అయోధ్యలోని అన్ని విషయాలు లక్ష్మణునికి మనోగోచరమయ్యాయి.
హనుమ తాను రామలక్ష్మణులను చూస్తున్నంతసేపు వారి కళ్ళల్లోకే చూడటం మొదలుపెట్టాడు. అతనికి రాముని కళ్ళలో పరమేశ్వరత్త్వం, అతని తమ్ముడు లక్ష్మణుని కళ్ళలో యోగిరాజు లక్షణాలు కనిపించాయి.
శ్రీరాముడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అవతారం. లక్ష్మణుడు శేషాంశ, ఉపాసనా స్వరూపుడు, తదనంతర కాలంలో యోగదర్శనాన్ని లోకానికి ప్రసాదించిన పతంజలి.
ఈ రెండు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండము లోనివి.
No comments:
Post a Comment