కన దురు రత్నభూషణ నికాయుడవై మహనీయమూర్తివై
యనుపమకీర్తిశోభితుడవై విలసిల్లుచు ధాత్రిమీద బెం
పొనరిన నీకు నేమి గతి నూసరవెల్లితనంబు చొప్పడెన్
విన నిది చోద్య మయ్యె సువివేకచరిత్ర! యెఱుంగ జెప్పుమా!
ఏ నిక్ష్వాకుతనూజుడన్ నృగుడు నా నేపారు భూపాలుడన్
దీనవ్రాతము నర్థి బ్రోచుచు ధరిత్రీనాయకుల్ గొల్చి స
మ్మానింపం చతురంత భూభరణసామర్థ్యుండనై సంతస
శ్రీ నిండారినవాడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లగన్.
పలుకుల దన్ను దా బొగడ బాతక మందు రటుండె దారకా
వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్కపెట్టగా
నలవడు గాని యేను వసుధామరకోటికి దాన మిచ్చు గో
వుల గణుతింప ధాతయును నోపడు మాధవ! యేమి సెప్పుదున్.
పొలుచు సువర్ణశృంగఖురముల్ దనరం దొలిచూలులై సువర్ణ వ
త్సలు గల పాడియావుల నుదాత్త తపోవ్రత వేదపాఠముల్
గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు పేద వి
ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పగ నిత్తు, నచ్యుతా!
శ్రీకృష్ణుడు లీలామానుషవేషధారి. అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లే, రత్నభూషణాలను అలంకరించుకొని, మహనీయమైన మూర్తిత్వంతో, అసమానమైన కీర్తిగడించిన నృపుడికి ఈ ఊసరవెల్లి జన్మ ఎట్లా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు శాపవిముక్తుడైన నృపుడు శిరస్సు వంచి కృష్ణునికి నమస్కరించి ఇట్లా అన్నాడు.
" ఓ విశ్వవేద్యా! మహానుభావ! ఈ జగత్తులో నీకు తెలియనిదంటూ ఏమన్నా ఒకటుందా? నీవు సర్వజ్ఞుడివి. అయినా నాద్వారా ఈ ప్రపంచానికి ఏదో తెలియేప్పాలని భావించావు కనుక చెబుతున్నాను.
నేను ఇక్ష్వాకువు కొడుకుని. నా పేరు నృగుడు. నేను సమర్ధవంతంగా రాజ్యపాలన చేస్తూ, అన్యరాజుల చేత కీర్తింపబడుతూ, దీనజనపోషణ చేస్తూ, అంతులేని కీర్తిని సంపాదించాను.
నన్ను గురించి నేను చెప్పకూడదు. ఆత్మస్తుతి పాపమంటారు. కానీ, మీరు చెప్పమన్నారు కనుక చెబుతున్నాను. నక్షత్రాలను, ఇసుక రేణువులను, మంచుబిందువులను లెక్కపెట్టవచ్చు. కానీ, నేను దానమిచ్చిన గోవుల సంఖ్యను లెక్కించటం బ్రహ్మదేవుడి తరం కాదు. ఏమని చెప్పేది?
ఇంకా వినండి, అచ్యుతా! నేను తపోనిధులు, వేదపండితులు, విహిత కర్మలను ఆచరించే బ్రాహ్మణశ్రేష్ఠులకు , పేదబ్రాహ్మణులకు, బంగారు కొమ్ములు, గిట్టలు తొడిగిన తొలిచూలు పాడి ఆవులను, వాటి దూడలతో పాటు భూరిదక్షిణగా ఇచ్చాను.
ఇంతేకాకుండా, న్యాయంగా సంపాదించిన సంపద నుండి, గోదానం, భూదానం, హిరణ్యదానం, రత్నదానం, గృహదానం, రథదానం, గజదానం, అశ్వదానం, సరస్వతీదానం, వస్త్రదానం, తిలదానం, కన్యాదానం, మొదలైన ఎన్నో దానాలు చేసాను. పంచమహాయజ్ఞాలు నిర్వర్తించాను. మంచినీటి బావులు, దిగుడుబావులు, చెఱువులు, ఉద్యానవనాలు నిర్మించాను. ఇట్లా ఉండగా ఒకరోజు ఒక విశేషం జరిగింది. "
ఈ నృగమహారాజు కథ శ్రీమదాంధ్ర మహాభాగవతము దశమస్కంధంలో ఉంది.
No comments:
Post a Comment