నీ వలనన్ మహాత్మ! విను నిర్భరచిత్తుడ నైతి జూడగా
బోవు తలంపు పుట్టెడు బ్రభూతగుణున్ బలదేవు వత్సలన్
దేవకి నార్ద్రచిత్తు వసుదేవుని మద్గతరాగసాంద్ర స
ద్భావుల సర్వయాదవుల బార్థ! ననుం దగ నన్పిపుచ్చవే.
శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ పద్యం నడక, తనవారందరినీ చూడాలని శ్రీకృష్ణుని హృదయం ఎంత ఆరాటపడిందో, అంత అందంగాను, ఆర్ద్రంగాను సాగి, పఠితల హృదయాల్లో ఆ భావాన్నే ప్రతిష్ఠించింది.
కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం సాధించి, ధర్మరాజు పరిపాలన చేస్తుండగా, కృష్ణార్జునులు ఏ విధంగా కాలం గడిపారని జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. దానికి, వైశంపాయనుడు, కృష్ణార్జునులు ఇంద్రప్రస్థంలోనే ఉండి, వివిధ ప్రదేశాలను తిరుగుతూ, బ్రాహ్మణులను పూజిస్తూ, సత్కథలను వింటూ, సత్కావ్య గోష్ఠి చేస్తూ, ధర్మరాజు సాధుస్వభావాన్ని ప్రశంసిస్తూ కాలం గడిపారని చెప్పాడు. ఆ తరువాత, శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క సద్గుణాలను పొగిడి, అతడి ముఖంలోకి చూస్తూ ఇట్లా అన్నాడు.
" అర్జునా! నేను చెప్పేది సావధానంగా విను. నీ సాహచర్యంలో నేను ఎంతో ఆనందాన్ని పొందాను. బాగా తృప్తిగా ఉంది. ఇప్పుడిక నాకు గొప్ప గుణసంపన్నుడు అన్నగారు బలదేవుడిని, నన్ను ఎంతో వాత్సల్యంతో చూసే అమ్మ దేవకిని, ఆర్ద్రచిత్తంతో నా కోసం నిరీక్షించే తండ్రి వసుదేవుడిని, నేనంటే ఎంతో అనురాగం, సద్భావం కలిగిన యాదవులందరినీ చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అందువల్ల, నీవు తగినవిధంగా నన్ను దయతో పంపించు. "
ద్వారకకు వెళ్ళడానికి శ్రీకృష్ణుడికి అర్జునుని యొక్క అనుమతి అవసరమా? కానీ, యోగయోగీశ్వరుడైన శ్రీకృష్ణుని ప్రవర్తన, లోకానికి ఆదర్శంగా, అతని లోకమర్యాదను ప్రస్ఫుటింపజేస్తున్నది. బంధువుల ఇండ్లలో నుండి తిరిగివెళ్ళేటప్పుడు, వారి అనుమతిని కోరడం లోకమర్యాద. అదే చేశాడు శ్రీకృష్ణుడు. కృష్ణార్జునులు ఒకే ప్రాణం, రెండు తనువులుగా ఉన్నవారు. అందువలన, " మహాత్మ! " అన్న కృష్ణుని సంబోధన కూడా ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉంది.
No comments:
Post a Comment