మృతియును జీవనంబు నివి మేదిని లోపల జీవకోటికిన్
సతతము సంభవించు, సహజం బిది, చోర హుతాశ సర్ప సం
హతులను దప్పి నాకటను బంచత నొందెడు నట్టి జీవుడున్
వెతలను బూర్వకర్మ భవవేదన లొందుచు గుందు నెప్పుడున్.
పరీక్షిన్మహారాజు తక్షకుని విషాగ్ని జ్వాలల్లో కాలి బూడిద అయ్యాడని విన్న జనమేజయుడు సర్పయాగం చేయసాగాడు. హోమకుండంలో సర్పాలన్నీ పడి, బూడిదయిపోసాగాయి. భయంతో ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకొన్న తక్షకుడు, ఇంద్రునితో సహా యజ్ఞగుండంలో పడబోతుండగా, అంగిరసుడు జనమేజయుని వద్దకు వచ్చి, అతడిని స్తుతించి, తత్త్వ బోధ చేసి, సర్పయాగాన్ని విరమింపజేశాడు. అప్పుడు అంగిరసుడు చెప్పిన మృత్యుతత్త్వమే ఈ పద్య భావం.
" ఓ మహారాజా! చావుపుట్టుకలు జీవులకు సహజం. ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దొంగలవల్ల గాని, అగ్నివల్ల గాని, పాముకాటువల్ల కానీ, దప్పికవల్ల కాని, ఆకలితో గాని, మరణించే జీవుడు, తాను పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ, కష్టాలకు గురవుతున్నాడు గాని వేరొకటి కాదు. "
ఈ పద్యం, పోతనగారి ప్రియశిష్యుడు వెలిగందల నారయ రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము, ద్వాదశ స్కంధములో ఉన్నది.
No comments:
Post a Comment