సైరంధ్రు ల్పయికెత్తి కజ్జలము బక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుం గన్నుల మీదు చూచు తఱి ఫాలాంచ చ్చతుర్థీ నిశా
స్ఫారేందుం గనె వక్త్ర; మక్కనుటగా బర్వేందు డాత్మప్రభా
చోరుం డుండగ దన్ను దద్గతవిభా చోరం బనున్ లోకముల్.
ఇది ఎంతో అందమైన పద్యం.
విష్ణుచిత్తుడు పెంచుకుంటున్న అమ్మాయి యవ్వనంలోకి అడుగుబెట్టింది. సహజంగా అందమైన పిల్ల, దానికి తోడు చక్కగా అలంకరించుకొంటుంది. అలంకరించే స్త్రీలు, కళ్ళకు కాటుక దిద్దటానికి, ఆమె విశాలనేత్రాలను పైకెత్తారట. అప్పుడామె చవితినాటి నెలవంకను చూసిందట. ఆ దోషం వల్ల, ఆమె చెప్పలేని అపవాదుని మూటకట్టుకున్నదట. అదేమిటంటే, యదార్థానికి ఆమె ముఖకాంతిని చంద్రుడు దొంగిలించినా కూడా, లోకం మాత్రం చంద్రుని కాంతిని ఆమె ముఖం అపహరించిందని చెప్పుకుంటున్నదట. అంటే, చంద్రుని కాంతిని తలదన్నే ముఖకాంతి కలది అని అర్థం.
ఇక్కడ, ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారు ఆముక్తమాల్యదకు వ్రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో లలితాసహస్రనామాలలోని ఒక నామాన్ని ఈ పద్యానికి అనుసంధానం చేశారు.
" లలితాసహస్రనామావళిలో ' అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా ' అనే నామం ఉంది. ఆ నామానికి అర్థమేమిటంటే, అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించే ఫాలభాగంతో శోభించే తల్లీ! లావణ్యంతో మెరిసిపోయే నీ ఫాలం శిరస్సు పైనున్న చంద్రరేఖ యొక్క ప్రతిరూప మనుకొంటాను. కాకపోతే రెండు చంద్రరేఖలును తలక్రిందులుగా కలసి పండు వెన్నెల కురిసే పూర్ణ చంద్రునిగా ఎందుకౌతాయి. "
అంటే, పరమేశ్వరీస్వరూపమైన గోదాదేవి అతిలోకసౌందర్యవతి అని అర్థం.
ఈ పద్యం శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యద, పంచమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment