ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌ బద్మాకరం బంచు ద
త్కమలామోదసుగంధ మారుతము వీకన్ ము న్నెఱింగించినన్
రమణం బిల్చె సరోవరం బనిలజున్ రాజీవరాజీ వస
త్సముదాళివ్రజచక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్.
మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక సరోవరం భీముణ్ణి రా రమ్మని పిలుస్తూ ఉందట. నన్నయగారి పద్యం నడక, సరోవరప్రాంతాన్ని వర్ణించిన తీరు చూస్తే, ఆ సరోవరం పాఠకుడిని కూడా రమ్మని పిలుస్తున్నట్లుగానే ఉంది. శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, షష్ఠాశ్వాసం లోని ఈ పద్యవిశేషాలను పరిశీలిద్దాం.
లక్క ఇంటిని తగలబెట్టి, రహస్య బిలమార్గం గుండా భీముడు, తల్లి కుంతిని, సోదరులను, అడవిలోకి చేర్చాడు. ఆ తరువాత వారంతా గంగానదిని దాటి, దక్షిణ దిక్కుగా నడవసాగారు. ఆకలిదప్పులతో నీరసించిపోయిన వారిని, భీముడు ఎత్తుకొని, చాలా దూరం నడిచి, సాయంకాల మయ్యేసరికి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు క్రింద దించాడు. ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమోనని, చెట్టెక్కి చూడసాగాడు. కొంతదూరంలో, అతనికి ఒక సరోవరం కనపడింది. ఆ సరోవరం ఎట్లా ఉంది?
మనసుకు హాయిని కలిగించేటట్లుగా ఉంది. సరస్సు నిండా నీళ్ళున్నాయి. ఆ నీటిని ఆవరించి, మంచి వాసనలు వెదజల్లుతూ తామరపూలున్నాయి. సరోవరం మీద నుండి వీచే చల్లని గాలి, తామరపూల వాసనను మోసుకొస్తూ ముందుగా పరిచయం చేస్తుండగా, ఆ పూలపై వ్రాలిన తుమ్మెదలు ఝంకారం చేస్తుండగా, ఆ ప్రాంతంలో ఉన్న చక్రవాక పక్షుల, కొంగల, క్రౌంచ పక్షుల కూతలు వీనుల విందు చేస్తుండగా, సరోవరం భీముణ్ణి రా రమ్మని పిలిచింది ".
సరోవరం భీముడిని పిలుస్తున్నదనడంలో హిడింబ భీముడిని వలచి ఆహ్వానించనున్నదనే భావికదార్థ సూచన దాగి ఉంది.
No comments:
Post a Comment