ప్రకటిత భూతసంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుడవు, దేవముఖుండవు నీవ, లోకపా
వకుడవు నీవ, యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభా
రక ! భువనప్రవర్తనపరాన్ముఖభావము బొంద బాడియే?
భృగుమహర్షి అగ్నిదేవుడిని సర్వభక్షకు డవమని శాపమిచ్చాడు. నిజం చెప్పినందుకు, లోకహితుడయిన తనకు అన్యాయంగా శాపమిచ్చి లోకాలకు భృగువు అపకారం చేసాడన్న కారణంతో, అగ్ని తన తేజాన్ని ఉపసంహరించుకొన్నాడు. దానితో ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం, అనే ఈ మూడు అగ్నులూ ప్రకాశహీనవడం చేత యాగకార్యాలు ఆగిపోయినాయి. మూడు కాలాల్లో చేసే హోమాలు, అగ్నికార్యాలు ఆగిపోయాయి. పితృకార్యాలు ఆగిపోయి, పితృదేవతలకు సమర్పించే పిండాలు, అగ్నిముఖంగా వారికి అందజేయటం ఆగిపోయింది. జనమంతా భయపడి మునులను ఆశ్రయించారు. మునులు దేవతల దగ్గరకు వెళ్ళి మొరబెట్టుకొన్నారు. మునులు, దేవతలు కలిసి బ్రహ్మదేవుడి వద్దకు పోయి విన్నవించుకున్నారు.
" బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును, సకల లోక వ్యవహార విచ్చేదంబును నెఱింగి, యగ్నిదేవు రావించి " , ఇట్లా అన్నాడు.
" ఈ కనపడే ప్రాణికోటి కంతటికీ నీవే అధిపతివి. వారిలో కదిలించే శక్తి, అచేతనంగా చేసే శక్తి నీలోనే ఉన్నాయి. వాని ఆ ప్రవర్తనకు కూడా కారణం నీవే. నీ ద్వారానే దేవతలు అన్నీ అందుకుంటారు. లోకాలను శుద్ధి చేసేవాడివి నీవు. ఇటువటి కొనియాడదగిన గుణాలు కలిగిన నీవు, విశ్వాన్ని భరించేవాడివైన నీవు, లోకాలను ప్రవర్తిల్ల జేయడంలో, ప్రకాశింప జేయడంలో, విముఖత్వం చూపించడం భావ్యమా? "
పద్యంలో ప్రతి విశేషణపూర్వక సమాసం చివర " నీవ, నీకు " అనే పదాలు, ఈ చరాచర జగత్తులో అగ్నిదేవుని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. బాహ్యంగా, అంతర్గతంగా, జీవకోటి మనుగడకి అగ్ని యొక్క ప్రాధాన్యత యెంత ఉందో ఈ పద్యం వల్ల చక్కగా తెలుస్తుంది.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాబారతము, ఆదిపర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment