ధారుణి యెల్లయుం దిరుగు దాను సుతారము సూర్యమండలా
ధారముగాగ జక్రదరధారి సకుండలమూర్తి జ్యోతియౌ
సూరుడు వొల్చు నక్షిపురుషుండు తదంతరవర్తి మీ కులా
ధార మతండు, సూర్యకులధామము వెల్తురు లేక మ్రగ్గునే!
పుత్రసంతానలేమిచే బాధ పడుతున్న దశరథుడిని అనునయిస్తున్నాడు సుమంత్రుడు.
" చేతిలో శంఖచక్రాలను, చెవులకు కుండలాలను ధరించి, సూర్యమండలం మొత్తానికి కాంతిప్రదాతగా ఉన్నవాడు, ఈ భూమిని సుతారంగా చుట్టివస్తూ, జగత్తుకు కన్నులాంటి వాడు, సూర్యమండలం మధ్యలో నారాయణస్వరూపంగా వెలుగొందుతున్నవాడు, అయిన సూర్యనారాయణమూర్తి మీ వంశకర్త. అటువంటి సూర్యుని కులానికి పుట్టినిల్లు లాంటిదైన మీ ఇల్లు, వెలుతురు లేకుండా మ్రగ్గిపోతుందా ! "
రామరావణ యుద్ధానికి ముందు అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్యహృదయం ఉపదేశించాడు. ఆదిత్యహృదయానికి ప్రార్థనా శ్లోకం, పై భావాన్నే తెలియజేస్తుంది.
" ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుధృత శంఖచక్రః. "
ఇక్ష్వాకువంశానికి చెందినవాడు దశరథుడు. ఇక్ష్వాకువు సూర్యుని మనుమడు. సూర్యవంశానికి చెందిన రాజులకు ఉపాస్యదైవం శ్రీమహావిష్ణువు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టిఖండములో ఉంది.
No comments:
Post a Comment