చలదుర్వీధరలీల గ్రాలు మదవస్తామోద్భవస్తోమ మ
గ్గలమై యేచిన సేన లొప్పగ దిశల్ గంపింప విందానువిం
దులు గాళింగ మహావిభుండు భగదత్తుండున్ భవత్సేనయో
ధులకుం గన్నుల పండువై నడచి రుత్తుంగాంగ సంరంభులై.
సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలను చెబుతున్నాడు. భీష్మ, ద్రోణులతో పాటు, జయద్రధుడు, విందానువిందులు, భగదత్తుడు - వీరందరూ మొదటిరోజు యుద్ధంలో పాల్గొన్నారు.
" నడిచే కొండలలాగా కనపడే మదించిన ఏనుగుల గుంపులతో, విందుడు, అనువిందుడు అనే రాజసోదరులు, కళింగాధిపతి భగదత్తుడు, నీ సేనలోని వారికి ప్రోత్సాహం కలిగిస్తూ, చూడటానికి కన్నుల పండుగగా, సమరోత్సాహంతో యుద్ధరంగానికి కదలివెళ్ళారు. "
ఇక్కడ ఒక విషయం గమనించాలి. సంజయుడు " భవత్సేనయోధులకుం (నీ సేనలోని వీరులకు) " అన్నాడు గానీ, దుర్యోధనుని సేన అనలేదు. ధృతరాష్ట్రుడి మితిమీరిన పుత్రవ్యామోహం సంజయుని కి తెలుసు. అందుకనే, అతడు సంతోషపడతాడని ' నీ సేన ' అన్నాడు.
విందుడు, అనువిందుడు అనేవారు సోదరులు. అవంతీదేశానికి చెందినవారు. కురుక్షేత్రయుద్ధంలో దుర్యోధనుని పక్షాన పోరాడారు.
భగదత్తుడు, నరకుని కొడుకు. సహజంగా పాండవ పక్షపాతి. కానీ, జరాసంధుని భయం వల్ల, దుర్యోధనుని పక్షాన పోరాడాడు. ప్రాగ్జ్యోతిషపురం ఇతని రాజధాని. ఇతని ఏనుగు పేరు సుప్రతీకం.
మదించిన ఏనుగుల కుంభస్థలం నుండి సువాసనాభరితమైన మదజలం కారుతుంటుందని కవులు వర్ణిస్తుంటారు. దానిని దానజల మంటారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment