హరి దననాభి పంకరుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరు డతిభక్తివేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
పరగ జనించి భూభరము బాపిన భవ్యులు రేవతీందిరా
వరులట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే?
పంకరుహము = పద్మము (బురదలో పుట్టునది పద్మము)
భవ్యులు = శుభాన్ని కలిగించే రూపం కలవారు
పాండవుల రాజ్యభాగం వారి కిచ్చి అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని హితవు పలికిన విదురుణ్ణి దూషించాడు దుర్యోధనుడు. దానితో మనస్తాపం చెందిన విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ తీర్థయాత్రలలో భాగంగా ప్రభాసతీర్థానికి వచ్చాడు. అక్కడ, కురుక్షేత్ర మహాసంగ్రామంలో దుర్యోధనాదులు మరణించిన వార్త విని దుఃఖించాడు. మనస్సు వికలమై, పుణ్యనదులలో స్నానం చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళ్ళాడు. యమునానదీ తీరంలో, శ్రీకృష్ణుని కూరిమి చెలికాడు, పరమభాగవతోత్తముడైన ఉద్ధవుణ్ణి కలుసుకున్నాడు. ఉద్ధవుణ్ణి గాఢాలింగనం చేసుకొని, అందరి యోగక్షేమాలు అడిగాడు. శ్రీకృష్ణుని భక్తులు, పవిత్రచరిత్ర కలిగిన వారైన పాండవులు కుశలమేనా అని అడిగాడు. తరువాత యదుకులాలంకారులైన బలరామకృష్ణులను గురించి ముచ్చటించాడు. దానికి సంబంధించినదే శ్రీమదాంధ్ర మహాభాగవతము, తృతీయస్కంధము నందలి యీ పద్యం.
" మహాత్మా! ఉద్ధవా! తన నాభికమలంలో పుట్టిన బ్రహ్మ ప్రార్థింపగా, యదువంశంలో బలరాముడుగాను, కృష్ణుడుగాను అవతరించాడు శ్రీ మహావిష్ణువు. అట్లా జన్మించి, భూభారాన్ని పోగొట్టి, వరుసగా రేవతిరుక్మిణుల హృదయవల్లభులైన రామకృష్ణులు, తాతగారు శూరసేనుని ఇంట్లో సుఖంగా ఉన్నారా? "
శ్రీ మహావిష్ణువు, తన శేషాంశతో, బలరాముడిగా, తన సంపూర్ణతేజంతో శ్రీకృష్ణుడిగా అవతరించి, దుష్ట సంహారం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వారా భూభారాన్ని తగ్గించారు.
రేవతి రైవతుడనే రాజు కూతురు. ఆమెకు తగిన భర్త యెవరని అడగటానికి రైవతుడు సత్యలోకానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ కిన్నర కింపురుషులు నాట్యం చేస్తున్నారు. అందుకని, రైవతుడు ఒక్క క్షణ మాగి తను వచ్చిన పని బ్రహ్మతో చెప్పాడు. రైవతు డిక్కడ ఆగిన సమయంలో, భూలోకంలో ఏండ్లుపూండ్లు గడిచిపోయాయని, ఆమెకు తగినవారు, వంశాలు కూడా కాలగతిలో కలిసిపోయాయని, ఇప్పుడు నారాయణాంశతో బలరాముడిగా ఒక మహానుభావుడు యాదవవకులంలో పుట్టాడని, రేవతిని ఆయన కిచ్చి వివాహం చేయమని చెప్పాడు బ్రహ్మదేవుడు. బలరాముని భార్య రేవతికి సంబంధించిన పురాణగాథ ఇది.
ఇక ఇందిర అంటే లక్ష్మీదేవి. రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవియే.
శూరసేనుడు కృష్ణునికి తాత. మాధురము, శూరసేనము అనే దేశాలను పరిపాలించిన రాజు. మదురా నగరం ఇతని రాజధాని. వసుదేవు డితని కుమారుడు.
No comments:
Post a Comment