అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి ! ప్రకటస్ఫుటభూషణ రత్న రోచిరా
చుంబితదిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ! భా
వాంబరవీధివిశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ !
ఇది ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ పూరించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసంలోని పద్యం.
మార్కండేయ మహర్షి ధర్మరాజుకి వైన్యుడి చరిత్రం చెప్పిన తరువాత, పలు ధర్మసూక్షాలకు నిలయమైన సరస్వతీగీతను చెప్పాడు. భగవంతుడైన కృష్ణుడి చేత చెప్పబడిన ఉపనిషత్సారానికి భగవద్గీత అని ఎట్లా పేరు వచ్చిందో, అదే విధంగా ఇది సరస్వతీదేవి చేత చెప్పబడటం వల్ల సరస్వతీగీతగా ప్రసిద్ధి వహించింది.
తార్క్ష్యుడనే మునీశ్వరుడు సరస్వతీదేవిని గురించి తపస్సు చేసాడు. ఆ దేవి ప్రత్యక్షమైనప్పుడు ఆమెను ఈ విధంగా స్తుతించాడు.
" అమ్మా! సరస్వతీ! నీవు అప్పుడే వికసించిన పద్మాల వంటి చేతులు కలిగినదానివి. శరత్కాలపు వెన్నెల వంటి శరీరకాంతి కలదానివి. దిగంతాల వరకు కాంతులు వెదజల్లే ఆభరణాలు ధరించినదానివి. వేదసూక్తాలలో వర్ణించబడిన స్వీయమహిమ కలిగినదానివి. మా ఊహలు అనే ఆకాశవీధుల్లో చక్కగా విహరించేదానివి. నన్ను దయచూడు తల్లీ ! "
పద్మం జ్ఞానానికి ప్రతీక. సరస్వతీ జ్ఞానస్వరూపిణి. వెన్నెల స్వచ్ఛతకు మారుపేరు.
యసస్సును వెన్నెలతో పోలుస్తూ యశశ్చంద్రికలు అంటారు. జ్ఞానం వల్ల తనువు చాలించిన తరువాత కూడా నిలబడే కీర్తి వస్తుంది. దిగంతాలు అనంతత్వానికి ప్రతీక. అమ్మవారు శబ్దరూపంలో విశ్వవ్యాప్తమైన ఓంకార స్వరూపిణి. పరమేశ్వరీ స్వరూపమైన సరస్వతీదేవి వేదసూక్తాలలో వర్ణించబడింది. అవి సరస్వతీసూక్తములుగా ప్రసిద్ధి వహించాయి. సరస్వతీదేవి వేదస్వరూపిణి. పర, పశ్యంతి, మధ్యమ అనే రూపాలలో భావజగత్తులో విహరించి, వైఖరీ వాక్కుగా బహిర్గతమవుతుంది అమ్మవారు. సరస్వతి వాక్స్వరూపిణి.
పిల్లలకు చిన్నతనం నుండే ఇటువంటి పద్యాలను నేర్పితే, వారికి, అక్షరాలను చక్కగా పలకడం చేతనవుతుంది. తద్వారా, " పెళ్ళి " అనేది " పెల్లి " గా పలికే దుర్దశ తొలగిపోతుంది.
పోతనగారు ముచ్చటపడి ఈ పద్యాన్ని తన ఆంధ్రమహాభాగవతములో ప్రార్థనా పద్యంగా చేర్చారు..
No comments:
Post a Comment