ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి బాంధవా
నంద విధాయి యైన నిజనందను దండితశత్రు సద్గుణా
నందితు జూచి వేడ్క నయనంబులు వేయును గన్న తత్ఫలం
బందె బురందరుండు పరమాద్భుత సమ్మదపూరితాత్ముడై.
అర్జునుడు శివుని ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రం సంపాదించాడు. ఈ విషయం తెలుసుకొన్న దేవేంద్రుడు, యమ, వరుణ, కుబేర, అశ్వినీదేవతలతో సహా అర్జునుడి వద్దకు వచ్చి వరాలు కోరుకొమ్మన్నాడు. యముడు దేవతల నందరినీ చూసేందుకు వీలుగా దివ్యదృష్టి ప్రసాదించాడు. వరుణుడు వారుణాస్త్రాన్నిచ్చాడు. కుబేరుడు కౌబేరాస్త్రాన్నిచ్చాడు. ఐరావతాన్ని అధిరోహించి, చేత వజ్రాయుధాన్ని పూని, యమ, వరుణ, కుబేర, అశ్వినీదేవతలతో సహా వచ్చినటువంటి ఇంద్రుడిని చూసాడు అర్జునుడు. సంతోషంతో పులకించిపోయాడు.
శివుని అనుగ్రహంతో అభీష్టవరాలు పొంది, బంధువర్గానికి ఆనందం కలిగించి, శత్రుభయంకరుడై, మంచి గుణాలు కలిగియున్న తన కుమారుడు అర్జునుడిని తనివితీర చూసిన ఇంద్రుడు తనకు వేయి కనులు ఉన్నందుకు సత్ఫలితాన్ని పొందాను కదా అని పరమానందభరితుడయ్యాడు.
కొడుకు అభ్యున్నతిని చూసి తండ్రి సంతోషించటం సహజం. ఎంతోదూరంలో ఉన్నా, చంద్రోదయం కాగానే సముద్రుడు పులకించిపోతాడు కదా !
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment