గుమ్మడిపువ్వు దేనియయు గూపము నైందవరేఖకాంతియున్
జు మ్మరయంగ గర్మఫల శోభనసంపద; జున్ను నేఱు బూ
ర్ణమ్మగు చంద్రబింబము ననం దగు నిర్మలవిద్య గాఢ పా
కమ్ము ఫలోదయం బది యఖండసుఖాత్మ పదంబు పుత్రకా !
శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వం, పంచమాశ్వాసంలో, వ్యాసమహర్షి శ్రీశుకునికి తత్త్వబోధ చేసిన సందర్భంలోని పద్య మిది.
వేదం కర్మలని ఆచరించాలని, వదలాలని రెండు విధాలుగా చెబుతున్నది. ఇది ఒకదాని కొకటి విరుద్ధంగా ఉంది. కాబట్టి, ఇందులో ఏది చేస్తే ఏ ఫలం సిద్ధిస్తుందో చెప్పమని అడిగాడు శుకుడు. అప్పుడు వ్యాసమహర్షి కర్మమార్గం ప్రవృత్తి అనీ, కర్మరహితమార్గం నివృత్తి అనీ, మొదటిది బంధహేతువనీ, రెండవది బంధ విమోచనం కలిగించేదనీ చెప్పాడు. కర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి కలగటం నిజమైనప్పటికీ, అది అవిద్యాస్వరూపమేనని, శాశ్వతానందాన్ని, మోక్షాన్ని కలిగించేది కర్మత్యాగమేనని చెప్పాడు. దానిని వివరిస్తూ చక్కని ఉపమానాలని చెప్పాడు.
" గుమ్మడిపువ్వులోని తేనె, బావిలోని నీరు, చంద్రకిరణం కాంతి, తేనెతుట్టెలోని తేనెతో, నదీజలంతో, పూర్ణచంద్రకాంతితో క్రమంగా పోలిస్తే అవి అతిస్వల్ప ప్రయోజనకరమైనవి. అదేవిధంగా, కర్మమార్గంలో లభించే ఫలం, జ్ఞానమార్గంలో లభించే ఫలంతో పోలిస్తే చాలా తక్కువ. "
పై దానిని బట్టి, జ్ఞానమార్గం అధిక ఫలదాయకమని వ్యాసమహర్షి భావన.
No comments:
Post a Comment