పుడిసిట బట్టె నే తపసి పొంగు పయోనిధి నిల్వలానుజున్
కడుపున వ్రేల్చె నే తపసి గాఢతపోనిధి నయ్యగస్త్యునిన్
బొడగని వింధ్య భూధరము పొంకము బింకము దక్కి నేలలో
నడగె బిలాంతరస్థలి భయాహతి జొచ్చు కుళీరమో యనన్.
ఈ పద్యం, పరమ మాహేశ్వరుడు, మహాతపస్వి, సప్త ఋషులలో ఒకడైన అగస్త్య మహామునిని గురించి చెప్పినది. ' శారద నీ రూపము ' అని కీర్తింపబడిన, తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, ప్రథమాశ్వాసం లోనిది.
దేవతల విన్నపాల మేరకు, వింధ్యపర్వతం గర్వాన్ని అణచటానికి అగస్త్యుడు కాశీపట్టణాన్ని వదలి దక్షిణ దిశగా వింధ్య వైపుకు బయలుదేరాడు. అంతదూరం నుంచి అగస్త్య మహామునిని చూసిన వింధ్యపర్వతం, గర్వాన్ని, బింకాన్ని విడిచిపెట్టి నేలలోకి ఒదిగిపోయిందట. ఇక్కడ ఒక చక్కని ఉపమానాన్ని వాడాడు తెనాలి కవి. అదేమిటంటే, అగస్త్యుడిని చూసి, భయపడి నేలలోకి ఒదిగిపోయిన వింధ్యము, భయంతో బొరియలోకి దూరిన ఎండ్రకాయ వలె ఉందట.
ఇంతకీ, అగస్త్య మహర్షిని చూసి వింధ్యము అంత భయపడటమెందుకు? దానికి కారణాలను పద్యం మొదటి రెండు చరణాల్లో చూపించాడు రామకృష్ణ కవి. అగస్తు డేం సామాన్యుడా? ఒక్క గుక్కలో సముద్రజలాన్నంతా త్రాగేసాడు. ఇల్వలుని తమ్ముడు వాతాపి తన కడుపులో మాంసఖండాలుగా ఉండగా, బ్రేవుమని త్రేంచి, దహించివేసాడు. అంటే, జీర్ణం చేశాడు. మరి అంతటివాడిని చూడగానే భయం పుట్టదా?
కుళీరము అంటే ఎండ్రకాయ. పల్లెటూళ్ళలో పీత అని కూడా అంటారు.
మహాకవులకు ఎక్కడ ఏ పదాలు వాడాలో బాగా తెలుసు. వాడటం యేమిటి? వాటంతట అవి వచ్చి పడతాయి. " పొంకము బింకము దక్కి " అనే దానిలో బిందుపూర్వక హ్రస్వాక్షరాలు విధ్యపర్వతం ఎంత ఒదిగిపోయిందో సూచిస్తున్నాయి. ఇక ఉపమానంగా వాడిన ' కుళీరము ' అనే సంస్కృతపదం ఎండ్రకాయ డెక్కలని, అది వాటిని ముడుచుకొని బిలంలోకి దూరటాన్ని ఊహల్లోకి తీసుకువచ్చి, ఊహలకు రెక్కలున్నాయన్నది నిజమేననిపిస్తుంది.
కావ్యాల్లో, అగస్త్య మహర్షి గొప్పతనాన్ని వర్ణించే మంచి పద్యాలున్నాయి. వాటిలో ఇదొకటి.
No comments:
Post a Comment