వినయము విద్యయుం గలుగు విప్రుని యందును, గోవునందు, నొ
ప్పు నెఱయు హస్తియందు నొక పోకకుబోవని కుక్క యందు, దా
ని నడచి తెచ్చి వండి తిను నీచపుమాలనియందు దుల్యద
ర్శనులు దదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్.
శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసంలోని ఈ పద్యం వ్యాసమహర్షి శుకుడికి ఆత్మజ్ఞానం బోధించే సందర్భం లోనిది.
అన్ని ప్రాణులను సమభావంతో చూసేవారే పండితులు, జ్ఞానులు. అటువంటివారు, విద్య, వినయం మొదలైన సంపద కలిగిన బ్రాహ్మణులలోను, ఆవులోను, ఏనుగులోను, ఎందుకూ కొరగాని కుక్కలోను, చివరకు కుక్కమాంసం తినే మాలవానిలోను, పరిశుద్ధమైన పరమాత్మను దర్శిస్తారు. వారికి భేదభావ ముండదు.
పై పద్యానికి మూలమైన భగవద్గీతలో కూడా, " విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని/ శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. " అన్న శ్లోకం కనిపిస్తుంది.
No comments:
Post a Comment