జననాథోత్తము డింతి జూడ ననిమేషత్వంబు గాంక్షించు న
య్యనిమేషత్వము కాంతకాంతముఖచంద్రాసేవనానంద వా
సన బ్రాపించిన గోరు నప్పు డనిమేషస్వామిభావంబు గ
న్గొన నెందున్ నృపు లుత్తరోత్తరపదానూనస్పృహాచంచలుల్.
" గిరికాదేవి అందాన్ని కన్నులారా చూడాలనే ఆకాంక్షతో వసురాజు ఱెప్పపాటు లేకుండా ఊండాలని కోరుకున్నాడు. దేవతలు అనిమిషులు, ఱెప్పపాటు లేనివారు. అంటే, వసురాజు దేవత్వాన్ని కోరుకున్నాడు. దేవత్వం సిద్ధించింది కనుక, ఆమె ముఖచంద్రామృతాన్ని చక్కగా గ్రోలాడు. ఆ ఆనందంతో తనివితీరక, అనిమేషస్వామి భావాన్ని కోరుకున్నాడు. అనగా, దేవాధిపత్యాన్ని, ఇంద్రత్వాన్ని కోరుకున్నాడని భావం. ఎట్లాగైనా, రాజులు అంతకంతకు హెచ్చైన అధికారాన్నే కోరుకుంటారు కదా ! "
వసురాజు గిరికాముఖచంద్రామృతాన్ని త్రాగడానికి దేవత్వాన్ని కోరుకున్నాడు. ఆమెను కన్నులారా చూసిన తరువాత, తనివితీరక ఇంద్రత్వాన్ని కోరుకున్నాడు. వేయికన్నులతో ఆమె సౌందర్యాన్ని వీక్షించాలనుకున్నాడు.
ఈ పద్యం రామరాజభూషణుని వసుచరిత్రము, ద్వితీయాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment