ఇది యీ బాలిక కప్పజెప్పుదురటే యీచిట్టి మైత్రేయి కం
దదు పై కొమ్మ, శితాతపంబులు తరుద్వంద్వాంతరాళంబుగా
జెదరున్ వల్కల మొండు చాల దదియుం జెట్టెక్కి కట్టన్ వలెన్
మదదంతావళ మందయానునకు రామస్వామికిన్ బాధయౌ.
మున్యాశ్రమాలు ప్రేమ, కరుణ, జాలి, మొదలైన వాటికి ఆటపట్టులు. ఆశ్రమవాసులు నిర్మలాంతఃకరణులు, స్వతంత్రజీవులు. అటువంటి మున్యాశ్రమాలకు అవతారమూర్తియైన రామచంద్రుడు వస్తున్నాడు. అందరూ వారి వారి పనుల్లో మునిగిపోయారు. పెద్దవాళ్ళు, పిల్లలు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారా లేదా అని అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నారు.
ఎండ తగులకుండ ఉండేందుకుగాను, రెండు చెట్టుకొమ్మలకు కలిపి, నారచీరలను కట్టే పనిని ఒక బాలికకు అప్పచెప్పారు. అది గమనించిన, ఒక పెద్దావిడ ఇట్లా అంటున్నది.
" అయ్యో! ఈ పని యీ చిన్నపిల్లకి అప్పచెబుతారా? ఆ పై కొమ్మ యీ అమ్మాయికి అందదు. ఎండ పడకుండా ఉండాలంటే, ఈ నారచీరలు రెండు చెట్టుకొమ్మలకి కలిపి కట్టాలి. ఒక్క చీర చాలదు. అది కూడా పై కొమ్మలకి కట్టాలి. సరిగా కట్టకపోతే, రామచంద్రుడికి నడి నెత్తిన ఎండ తగిలి బాధ కలుగుతుంది. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండము లోని ఈ పద్యం ప్రేమకు ఆవాసమైన ఆశ్రమవాసుల నిర్మలహృదయాలను అందంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా, " మదదంతావళ మందయానునకు రామస్వామికిన్ బాధయౌ " అన్న చరణం, కోదండాన్ని ధరించి వస్తున్న ధీరగంభీరమూర్తిని స్ఫురింపజేస్తున్నది. కోదండం పైభాగం పైకెత్తిన గజేంద్రుని తొండం లాగా ఉంటుంది కదా! పద్యంలోని అందాన్ని పట్టుకోడానికి పాఠకుడు చేసే ఊహలకు, మహాకవుల కల్పనాచమత్కృతి ఎప్పుడూ ఒక బెత్తెడు పైనే ఉంటుందనిపిస్తుంది. ఎంత ప్రాప్తమో, అంతే దక్కుతుంది.
No comments:
Post a Comment