తిరుపతి వేంకటేశ్వరులు దేశము కైతయు గ్రుచ్చియెత్త బం
దరు పుర మాంగ్లపుం జదువునం జని వారలలోన వేంకటే
శ్వర గురురాజమౌళి పదసంజనిత త్రిదివాపగా సుధా
ఝరముల మున్కలాడు ఫలసంగతి సత్కవినై మెలంగుచున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక లోని ఈ పద్యం విశిష్టత దానిదే. ఎందుకంటే, ఇంగ్లీషు చదువుల ప్రభావం సమాజం మీద ఆనాడే పడి, జనం ఆ ప్రవాహంలో పడి మెల్లగా జారటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి, ఎక్కడో ఖండాంతరాలలో , తేలుతున్నారో మునుగుతున్నారో తెలియని పరిస్థితి. ఈ వ్యాఖ్య వ్రాసున్న సమయానికి, కరోనా అంటువ్యాధి దెబ్బకు ప్రపంచమంతా పండుటాకులా విలవిల్లాడిపోతోంది. కన్నబిడ్డ లొకచోట, తల్లిదండ్రు లింకొక చోట. మధ్యలో అంతులేని మానసికవ్యథ.
ఇక ప్రస్తుతానికి వస్తే, పై పద్యంలో, ఆ నాటి సమాజంపై తిరుపతివేంకటకవుల ప్రభావం యెంత ఉన్నదో చక్కగా వివరించారు. ఈనాటి వారికి తిరుపతివేంకటేశ్వర కవుల గురించి తెలుసో తెలియదో తెలియదు గాని, ఆనాడు వారిని గురించి తెలియనివారు లేరు. వారిని గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత, తెలియ చెప్పవలసిన బాధ్యత, వారిని గురించి తెలిసిన ఇప్పటి ఆతరం వారికుంది. ఆ తెలియజెప్పే పనిని పద్యరూపంలో విశ్వనాథవారు నెరవేర్చారు. దానిని పిల్లలకు చెప్పడమే మన ముందున్న కార్యం.
తెలుగునాడు మొత్తం, అంతేకాదు, తెలుగువారు నివసిoచే ఇతర ప్రాంతాలలో కూడా, ఆనాడు తిరుపతివేంకటేశ్వర కవుల గురించి తెలియనివారు లేరు. వారు జంటకవులు. ఒకరు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు. దివాకర్ల వేంకటావధాని గారి తండ్రిగారని చెబితే కొంతమందికైనా తెలుస్తుంది. రెండవవారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు. వారిద్దరూ ఆంధ్రదేశంలో పర్యటించి అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో, వారు వ్రాసిన పాండవోద్యోగవిజయాలు నాటకంలోని కొన్ని పద్యాలైనా రాని పల్లె, పట్నంవాసు లుండేవారుకాదు.
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు (1870-1950) ఇప్పుడు మచిలీపట్నం అని పిలువబడే బందరు పట్టణంలో ఉపాధ్యాయునిగా పనిచేసారు. గురువుగారు చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి ఆదేశం మేరకు తిరుపతిశాస్త్రిగారితో కలిసి అష్టావధానాలు, శతావధానాలు చేసి, ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు. ఆ రోజుల్లో, బందరు ప్రముఖ విద్యాకేంద్రం. మెల్లమెల్లగా, యువత ఆంగ్లచదువుల మీద ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ఆ దశలో, విశ్వనాథ సత్యనారాయణగారికి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యరికం చేసే భాగ్యం కలిగి, సత్కవిగా పేరుతెచ్చుకొనడం జరిగిందని వారు సగర్వంగా చెపుకున్నారు.
' వేంకటేశ్వర గురురాజమౌళి పదసంజనిత త్రిదివాపగా సుధా ఝరముల మున్కలాడు ఫలసంగతి సత్కవినై మెలంగుచున్ ' అని చెప్పుకున్నారు.
గురురాజు అంటే గురువులలో శ్రేష్ఠుడు. రాజు అన్న పదానికి చంద్రుడు అనే అర్థముంది. గురురాజమౌళి అంటే చంద్రశేఖరుడు, శివుడని అర్థం చెప్పుకోవచ్చు. ఆయన శిరస్సు నుంచి భూమిపైకి దిగివచ్చింది పవిత్రగంగానది. గంగానది ' త్రిదివాపగ '. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల్లో ప్రవహించేది. ఆ పవిత్రజలాల్లో (గురుత్వంలో) మునుకలాడే భాగ్యం కలిగిందట విశ్వనాథవారికి. ఆ గురురాజమౌళి వేంకటశాస్త్రిగారు. ఆయన కృప అనే సుధాపూరంలో మునుకవేసి, శిష్యుడిగా ఉన్నదానికి ఫలితంగా , సత్కవిగా మెలిగే భాగ్యం కలిగిందట. ఇక్కడ గురువుగారిని శివునిగా భావించారు విశ్వనాథవారు.
ఇక రెండవది. ' గురురాజమౌళి పదసంజనిత త్రిదివాపగా ఝరముల ' అన్నది. గురువులలో శ్రేష్ఠుడైన వేంకటశాస్త్రిగారనే విష్ణుమూర్తి పాదముల వద్ద జనించిన పవిత్ర గంగాజలాల్లో (గురుత్వంలో) అని అన్వయం చేసుకొనవచ్చు. అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపమైన గురువుగారి పాదముల వద్ద శిష్యరికం చేసి, సత్కవిగా పేరుప్రఖ్యాతులు పొందే భాగ్యం కలిగిందని కూడా అన్వయం చేసుకొనవచ్చు.
' గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ' అని కదా ఆర్యోక్తి. విశ్వనాథవారికి వారి గురువులైన చెళ్ళపిళ్ళవారి యెడల హరిహరాద్వైత భావన. అదే భావన వారి బృహత్కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షములో ప్రతిబింబించింది. రాముని కథను శివునకు అంకితమిస్తూ, " కాకుత్స్థుడౌ స్వామి గాథాసంపన్నము ద్వైతాద్వైత మార్గంబులన్ " భక్తితో తీర్చిదిద్దారు. కవిత్రయభారతంవలె, పోతన భాగవతంలాగా, తెలుగుజాతికి రామాయణం లేదే అన్న కొరత తీరింది.
No comments:
Post a Comment