పెరుగుట స్రగ్గగ, రుచులం
బొరయుట అరుచంబు గాగ, బుట్టుట సావం
బెరయుట పాయ బదార్థో
త్కరముల నైజమది, యెట్లు దప్పింప నగున్?
యౌవనంబును రూపంబు జీవితంబు
ద్రవ్య సంచయములు ననిత్యములు గావె?
వీని హానికి వగ పవివేక మగుట
బండితులు వగ గూరరు బౌరవేంద్ర!
కురుక్షేత్ర మహాసంగ్రామంలో జరిగిన కౌరవవంశ క్షయాన్ని పూసగుచ్చినట్లు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అంతా విన్న ధృతరాష్ట్రుడు శోకసముద్రంలో మునిగిపోయాడు. సంజయుడు అనునయ వాక్యాలు పలికిన తరువాత కూడా, అతడికి ఉపశమనం కలుగలేదు. అప్పుడు, విదురుడు అతని వద్దకు చేరి ఓదార్చటం మొదలుపెట్టాడు.
జనన మరణాలు సహజమనీ, అందువల్ల దుఃఖించాల్సిన పని లేదని చెప్పాడు విదురుడు. భూభారం పెరిగినప్పుడు, ఆ భారం తగ్గించుకొనడం కూడా ప్రకృతిలో సహజమైనదే. పెరగడం, తగ్గడం కోసమే అని, రుచుల మీద ఆసక్తి, వాటి మీద ఆసక్తి తగ్గిపోవడం కొరకే అని, చివరకు పుట్టటం కూడా చావటం కోసమేనని, ఇది పదార్థ సహజ స్వభావమని హితబోధ చేశాడు విదురుడు. దీనిని మార్చటం ఎవరివల్లా కాదని చెప్పాడు.
భారతీయ వేదాంత శాస్త్రమంతా ఈ ద్వంద్వాలను గురించి చెబుతూ, వాటిని దాటి ఆనందమనే స్థితిని పొందడమే జీవిత పరమార్థమని బోధిస్తున్నాయి. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన గీతాసారం కూడా ఇదే. ద్వంద్వాలంటే సుఖం x దుఃఖం, చలి x వేడి, రుచి x అరుచి, దగ్గర x దూరం, పుట్టుక x చావు, నీవు x నేను, నీది x నాది అనే భేదభావాలు. ఈ భేదభావం దుఃఖకారణం అని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. జీవుడు తన అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల, ఈ భేదాన్ని పోగొట్టుకొని, దుఃఖనివారణ చేసుకోలేకుండా ఉన్నాడు.
అంతేగాక, యవ్వనం, రూపం, జీవితం, పదార్థం అన్నీ అనిత్యమనీ, కాలగతిలో అవన్నీ నశించిపోయేవేననీ, విదురుడు చెప్పాడు. కాబట్టి అశాశ్వతమైన వాటి గురించి దుఃఖించటం అవివేకమని విదురుడు చెప్పాడు. ఈ సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడిని " పౌరవేంద్ర " అని సంబోధించాడు. ధృతరాష్ట్రుడు పూరుని వంశానికి చెందినవాడు. పూరుడు యయాతి కొడుకు. యయాతికి యవ్వనాన్ని ఇచ్చి, అతని వార్థక్యాన్ని తీసుకొన్నవాడు. దానికి సంతోషించి, యయాతి పూరునికి రాజ్యాన్ని ఇచ్చాడు. అందువల్ల, అతని సంతతి పరంపరగా పౌరవులయ్యారు. కాలగతిలో, యయాతి, పూరుడు కలసిపోయారు. కానీ, పూరుని కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది.
కావున, పూరుని వంశంలో పుట్టిన ధృతరాష్ట్రుడికి అవివేకజన్యమైన ఇటువంటి దుఃఖం కూడదని భావం.
ఈ పద్యాలు శ్రీమదాంధ్ర మహాభారతం, స్త్రీపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment