సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాళములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్.
ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. అప్రస్తుతం కాదనుకుంటే, ఈ పద్యం యొక్క ఆదరణను చాటిచెప్పే ఒక సన్నివేశం, గురజాడ అప్పారావుగారి " కన్యాశుల్కం " నాటకంలో కనిపిస్తుంది. ఆంగ్లభాష మోజులో తెలుగును ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియజెప్పడానిక్, ఈ పద్యాన్ని చక్కగా ఉపయోగించుకొన్నారు పంతులుగారు.
శలవుల్లో గిరీశంతో పాటు ఇంటికి వచ్చిన వెంకటేశాన్ని, మేనమామ కరటక శాస్త్రి ఒక తెలుగు పద్యం చెప్పమని అడుగుతాడు. వెంకటేశం " నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానల...." వరకు చెప్పి నీళ్ళు నములుతుంటాడు. కరటకశాస్త్రి వెంకటేశన్ని " మనఃప్రభవానల " అంటే అర్థ మేమిటిరా అబ్బాయి అని అడుగుతాడు. దానికి గిరీశం, " దొరల స్కూళ్ళలో వాటికి అర్థాలు చెప్పరండీ, ఇప్పటికి మాత్రం బాగా బట్టియం వేయిస్తారు " అని దాటవేస్తాడు. " పద్యాలకు అర్థం చెప్పారూ? " అంటూ కరటకశాస్త్రి నోరెళ్ళబెడతాడు.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అది అంత అందమైన పద్యం కనుక.
" నలదమయంతు లిద్దరూ, మన్మథతాపనికి గురయినవారై, సుందరమైన నందనవనాల వంటి పూదోటల్లో, సుగంధం వెదజల్లే తామరపూలలో, మెత్తని తామరతూండ్లలో, కర్పూరపరాగంతో, మంచిగంధపు మైపూతతో, చల్లని నీటి జల్లులతో, మెత్తని ఆకులతో ఏర్పరిచిన శయ్యలపై, ఎడతెగని రాత్రులు గడిపారు. "
హంసదౌత్యము తరువాత, నలదమయంతు లిద్దరూ ఒకరికొకరు బహుదూరంలో ఉన్నారు. వారికి మన్మథతాపం ఎక్కువయింది. దీనిని విప్రలంభ శృంగారం అంటారు. మన్మథుని బారిన పడ్డ వీరిద్దరూ " దీర్ఘవాసర నిశల్ (ఎడతెగని రాత్రులు) " గడపటం ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉంది.
శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలోని ఈ పద్యంలో వాడిన వృత్యనుప్రాసం నన్నయగారి అక్షరరమ్యతకు చక్కని ఉదాహరణగా నిలిచింది.
No comments:
Post a Comment