విప్పెసలారు మోముపయి వేలుపువాహిని యెఱ్ఱయొండు బొ
ట్టొప్పగ స్నానమున్ సలిపి యొడ్డున నట్టిటు తిర్గుచున్ జరీ
కుప్పడమంచు ధోవతిని గొంగులువారగ నారబట్టు నే
గొప్ప ద్విజుండ వొక్కొ యిటకుం జనుదెంచితి మత్సఖుండవై.
లంకలో, సముద్రతీరాన, సాయంకాల సంధ్యోపాసనానంతరం ఒక రాతిపై కూర్చున్న శ్రీరామచంద్రునికి , సముద్రపు అలలపై నుండి ఒక హంస తనవైపు రావటం కనిపించింది. ఆ హంస కొంచెంసేపు ఆకాశంలోకి ఎగురుతూ, కొంచెంసేపు రామునికి సమీపంలో రెక్కలాడిస్తూ, కొంతసేపు, సముద్రతరంగాలను కాళ్ళతో విదిలిస్తూ తిరుగుతున్నది. హంసను చూసిన రామునికి, తన విరహవేదనను సీతకు తెలియచేయడనికి శివుడే ఆ రూపంలో వచ్చాడనిపిస్తుంది. ఇంకా, మనస్సు పలువిధాల ఆలోచనలతో నిండిపోతుంది. హంస, తన వియోగభావనాజనిత వాంఛాస్వరూపమనీ, తన కన్ను చెదిరిందనీ, తాను చూసింది నిజమైన హంసనేననీ, తలపోస్తూ, ఏమీ తెలియని స్థితిలో, తెలియకపోవటంలో ఒక విలక్షణమైన అనుభవపు ఊగిసలాటకు లోనయ్యాడు. ఈ రకమైన ఒక అనుభూతిని వర్ణించేదే ఈ పద్యం.
" ఓ హంసరాజమా ! విశాలమైన ముఖానికి గంగానది యెఱ్ఱ ఒండ్రు మట్టిని బొట్టుగా పెట్టుకొని, స్నానం చేసివచ్చి, నది ఒడ్డున అటూ ఇటూ తిరుగుతూ, జరీఅంచుల ధోవతి కుచ్చెళ్ళుగా పట్టుకొని, ఆరబెట్టుకొంటున్న ఒక బ్రాహ్మణశ్రేష్టుడిలాగా కనిపిస్తున్నావు నాకు. నా ప్రియమిత్రుడిలాగా కనిపిస్తున్నావు. "
శ్రీరామునికి హంసను గురించి ఆలోచించేటప్పుడు తనకు పరమశివుడే జ్ఞప్తికి వస్తున్నాడు. హంస " మీనాంక హరానలోజ్జ్వల శిఖాహంకార సౌందర్యం రేఖాంశమై " కనిపిస్తున్నది.
ముఖంపై యెఱ్ఱటి బొట్టుతో, స్నానం చేసివచ్చి, తడిసిన ధోవతి జరీ అంచులను కుచ్చెళ్ళుగా పట్టుకొని, గాలికి ఆరబెట్టుకొంటున్న ద్విజుని వలె హంస కనబడటం ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉంది. ఎందుకంటే, హంస ముక్కు ఎఱ్ఱగా, శరీరం తెల్లగా, రెక్కల అంచులు బంగారు రంగుతో మెరిసిపోతుంటాయి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, పక్షి.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండము నందలి యీ పద్యం చదవగానే చప్పున " తల పక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు " అన్న ఆముక్తమాల్యదలోని పద్యం స్ఫురణకు వస్తుంది. రాయలవారి ఆ పద్యం, వారి కల్పనాచమత్కృతికి నిదర్శనమైతే, విశ్వనాథవారి యీ పద్యం, వారి ఉదాత్తకల్పనకు తార్కాణం. ఉదాత్త కల్పన అని ఎందుకన్నానంటే, పక్షికులంలో హంస, మానవులలో బ్రాహ్మణుడు, స్వచ్ఛతకు, పవిత్రతకు స్థానాలుగా పెద్దలు పేర్కొంటారు.
No comments:
Post a Comment