క్రూరపు భూతముల్ జనుల ఘోరవిధంబుల ముట్టి యెప్పుడున్
మారణ మాచరింపగ సమస్తజనంబులు నాశ మొందగా
వారిజసంభవుం డెఱిగి వచ్చి ననుం దగ గాంచి తత్ప్రతీ
కారము సేతకై వినయగౌరవ మొప్పగ వేడె వేడినన్.
అచటన యుండి లోకముల నన్నిటి నాత్మ దలంచి రక్ష సే
యుచు విహరింతు, భూతచయ మొక్కట గూడి చరించుచున్కికిం
బ్రచురకుతూహలుండనయి రాగము బొందుదు నట్లు గాన నా
కచటు నివాసమయ్యె విను మన్యతలంబులు దాని బోలునే!
సామాన్యంగా మనందరకీ ఒక సందేహం మనసులో మెదులుతూ ఉంటుంది. అది ఏమిటంటే, శివుడు శ్మశానంలో ఎందుకు నివాసం ఉంటాడని.
ఆ సందేహానికి సమాధానం, శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థాశ్వాసంలో ఉమామహేశ్వర సంవాదమనే ఇతిహాసంలో కనిపిస్తుంది.
శుచిగా, మనోహరంగా ఉన్న ప్రదేశాల్లో ఉండక, శుభ్రత లేకుండా, మట్టి, ఎముకలు, పుఱ్ఱెలు, జుట్టు, దుర్వాసన అనేవాటితో దుర్భరంగా ఉండే వల్లకాటిలో శివుడు ఉండటానికి కారణ మేమిటని పార్వతి, తన భర్తను అడిగింది. దానికి సమాధానంగా శివుడు ఈ విధంగా అన్నాడు.
" క్రూరమైనటువంటి భూతగణాలు ప్రాణులను పట్టి పీడిస్తున్నాయి. ఆ బాధను తట్టుకొనలేక ప్రాణులన్నీ గగ్గోలు పెడుతున్నాయి.. ఈ పరిస్థితిని తెలుసుకొని, బ్రహ్మదేవుడు నా వద్దకు వచ్చి, ఈ మహోత్పాతానికి ఏమైనా నివారణోపాయం కనుగొనమన్నాడు . ఆ ప్రార్థనను మనసులో పెట్టుకొని, నేను అన్ని ప్రాణులూ కలిసి తిరిగే శ్మశానంలో తిరుగుతూ, లోకాలన్నిటినీ రక్షిస్తూ ఉంటాను. నా కదే ప్రీతికరమైనది. సర్వప్రాణులు కలిసివుండే శ్మశానాన్ని మించిన యోగ్యప్రదేశం ఎక్కడన్నా ఉంటుందా? "
మరణం తరువాత, సర్వప్రాణులు ఉచ్ఛనీచ భేదం లేకుండా శ్మశానంలో నివసిస్తాయి కనుక, శివునికి శ్మశానమే అత్యంత ప్రియమైనదని భావం.
No comments:
Post a Comment