నరనాథు గొలిచి యలవడ
దిరిగితి నాకేమి యనుచు దేకువ లేమిన్
మరియాద దప్ప మెలగిన
బురుషార్థంబునకు హాని పుట్టకయున్నే?
మనం చేసే ప్రతి పనిలోను ఒక మర్యాద ఉంటుంది. మర్యాద అంటే హద్దు. సముద్రము చాల లోతైనది, విస్తీర్ణమైనది. అట్లా అని సముద్రానికి కూడా హద్దు లేకుండా పోలేదు. సముద్రానికి హద్దు చెలియలికట్ట. అది దాటితే ఉప్పెన వస్తుంది. మనిషి హద్దు దాటితే ప్రమాదం సంభవిస్తుంది.
రాజుగారి దగ్గర చనువు ఉంది కదా అని నిర్భయంగా, హద్దులు మీరి ప్రవర్తించకూడదు. అట్లా చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది. ఎంత చనువు ఉన్నా, రాజు, సేవకుడు అన్న తేడా ఎప్పుడూ ఉంది. రాజు సేవకునికి చనువు నీయడం రాజుగారి మంచితనమైనా కావచ్చు లేకపోతే రాజుగారి బలహీనతైనా కావచ్చు. అదీ కాకుండా, రాజులు ఆగ్రహానుగ్రహ సమర్థులు. వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం చూపిస్తారో తెలియదు. అందుకని, సేవకుడు ఎప్పుడూ అప్రమత్తతతో మెలగాలి.
పద్యం చివరి పాదంలో ' పురుషార్థంబునకు హాని పుట్టకయున్నే? ' అన్నాడు. పురుషార్థాలు నాలుగు - ధర్మ, అర్థ, కామ మోక్షాలు. వీటిలో మొదటిది, ప్రధానమైనది ధర్మం. ధర్మం ప్రాతిపదిక మీదనే తక్కిన మూడు - అర్థం, కామం, మోక్షం సాధించాలి. ధర్మమనే హద్దు మీరితే మొదటికే మోసం వస్తుంది. ప్రాణహాని కూడా జరుగవచ్చు. సేవకుడు తన ధర్మం మరిచి, హద్దు మీరి ప్రవర్తిస్తే, అది రాజాగ్రహానికే కాకుండా, తక్కిన అధికారుల, సేవకుల అగ్రహానికి కారణమౌతుంది.
శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలో, పాండవుల అజ్ఞాతవాసానికి ముందు ధౌమ్యుడు చేసిన ఉపదేశంలో భాగమిది.
No comments:
Post a Comment