వరణాతరంగిణీదరవికస్వరనూత్న
కమలకషాయగంధము వహించి
ప్రత్యూషపవనాంకురములు పైకొనువేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్ఛాత్రు డగుచు నిచ్చలు నేగి యయ్యేట
నఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి గర్మసాక్షి కెఱగి
ఫలసమిత్కుశకుసుమాదిబహుపదార్థ
తతియు నుదికినమడుగుదోవతులు గొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి బ్రజ దన్ను మెచ్చి చూడ.
అల్లసాని పెద్దనామాత్యుడు రచించిన మనుచరిత్రము, ప్రథమాశ్వాసంలోని ఈ పద్యంలో, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఏ విధమైన నిత్యకర్మానుష్ఠానం చెయ్యాలో, ప్రవరుని దినచర్య ద్వారా చెప్పినట్లయింది.
ప్రవరుడు వేకువజామునే నిద్ర నుండి మేల్కొంటాడు. అప్పుడు, ప్రభాత సమయంలో ఎట్లా ఉంటుంది? వరణానది నిండా అరవిరిసిన తామర పూలుంటాయి. అవి వాటి సుగంధాన్ని ఆ ప్రదేశమంతా విరజిమ్ముతాయి. నది మీద నుండి వీచే పిల్లగాలులు ఆ ఒగరైన వాసనను మోసుకొస్తుంటాయి. అటువంటి సమయంలో నిద్ర లేచిన ప్రవరుడు, వామనుని స్తుతిస్తూ నిద్ర లేస్తాడు. ప్రాతఃసంధ్యాకాల నిత్యకర్మలను ఆచరించాల్సినవారు, వటువుగా అవతారమెత్తిన విష్ణువును స్మరించడం ఉదాత్తంగా ఉంది. తరువాత, శిష్యుల నందరినీ వెంటబెట్టుకొని, నదిలో అఘమర్షణ స్నానం చెయ్యడానికి వెళ్తాడు. అఘమర్షణమంటే పాపాలను పోగొట్టడం. అఘమర్షణ మంత్రం జపిస్తూ స్నానం చెయ్యడం. నదీతీరంలో, ఇసుకతిన్నె మీద కూర్చొని, కర్మసాక్షియైన సూర్యుడిని తలచుకొంటూ, సూర్యమండలాంతర్వర్తియైన శ్రీమన్నారాయణున్ని, గాయత్రీ మంత్రాన్ని జపిస్తాడు. అక్కడున్న, పూలు, పండ్లు, దర్భలు మొదలయిన వాటిని సమీకరించుకొని, మడి ధోవతులను తీసుకొని, శిష్యులు తనను అనుసరిస్తుండగా, చూసేవారు తనను మెచ్చుకుంటుండగా, ఇంటికి తిరిగి వస్తాడు.
బాహ్మణకులంలో పుట్టినవాడి దినచర్య ఈ విధంగా, క్రమబద్ధంగా, ధర్మయుతంగా ఉంటే, ఇతరుల కతడు ఆదర్శప్రాయుడౌతాడు. చాతుర్వ్యర్ణాలలో, బ్రాహ్మణుడు ధర్మాన్ని ఆచరించి, ప్రవర్తిల్ల జేయవలసినవాడు. అందువల్ల, ఇతరులకు అతడు మార్గదర్శి కావాలి.
ఈ వ్యాఖ్యాత చిన్నతనంలో, చందోలు శాస్త్రులుగారు అని పిలువబడే, ప్రాతఃస్మరణీయులు బ్రహ్మర్షి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వారి శిష్యబృందం, వేదాధ్యయనం చేస్తూ వెంటరాగా, సమీప గ్రామాలకు వెళ్ళడం, అది కళ్ళారా చూడగలగడం ఒక పూర్వపుణ్య విశేషంగా భావిస్తున్నాడు.
No comments:
Post a Comment