అట గాంచెం గరిణీవిభుండు నవ పుల్లాంభోజకల్హారమున్
నటదిందిందిర వారముం గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీతీరముం
జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్.
శ్రీమదాంధ్ర మహాభాగవతము, అష్టమ స్కంధము, గజేంద్రమోక్షణ ఘట్టంలోని ఈ పద్యంతో పోతన మహాకవి మనందరినీ ఒక్కసారి ప్రకృతి ఒడిలోకి తీసుకువెళ్ళాడు.
త్రికూటపర్వత ప్రాంతంలోని అడవిలో చాలా ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. ఒకనాడొక గజేంద్రుడు, అడవిలో ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతూ, దారి తప్పాడు. ఆ గజేంద్రునికి బాగా దాహం వేసింది. ఇంతలో ఆ గజరాజుకి చక్కని నీటికొలను కనిపించింది. అది ఎట్లా ఉంది?
అప్పుడే విచ్చుకొన్న తామరపూలు, కలువపూలతో నిండి ఉంది. ఆ పూలలోని మకరందాన్ని గ్రోలుతూ తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నాయి. కొలనంతా తాబేళ్ళతో, చేపలతో, మొసళ్ళతో నిండి, నీటిలో దిగటానికి అశక్యంగా ఉంది. కొలను సమీపంలో, మఱ్ఱి, తాడి, తియ్యమామిడి, మద్ది చెట్లున్నాయి. ఆ మడుగు ఒడ్డు పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు, పూలతీగలతో నిండిపోయింది. అదేవిధంగా, కొలను గట్ల వెంబడి ఉవ్వెత్తున ఎగిరే హంసలు, చక్రవాక పక్షులు, కొంగలు, విహరిస్తున్నాయి.
ప్రకృతి ప్రేమికులకు ఈ పద్యం చదవగానే ప్రాణం లేచివస్తుంది. పద్యంలో ప్రకృతిని
ఇంత అందంగా చూపించటం సహజపాండిత్యునికే సాధ్యమేమో!
No comments:
Post a Comment