నిధిసంఘంబు నిధానముల్ మణిగణానీకంబు మంత్రంబు లౌ
షధముల్ భూరిరసాయనంబు రస మా స్పర్శాదివేధుల్ సకామ
ధుగోఘంబులు కల్పవృక్షములు తన్మాహాత్మ్య మూహింప జం
ద్రధరా ! మీ కరుణాబ్ధిఫేనలవముల్ దారిద్ర్యవిద్రావణా!
" దారిద్ర్యాన్ని పోగొట్టే ఓ! , శివా ! వివిధ నిధులు, ధనాగారాలు, మణుల సమూహము, మంత్రాలు, ఔషధాలు, జీవనౌషధాలు, పాదరసము, పరుసవేదులు, కామధేనువులు, కల్పవృక్షాలు - ఇవన్నీ మీ కరుణ అనే సముద్రము యొక్క నురుగు తరంగాలు లేక తుంపరలు మాత్రమే. "
పరమేశ్వరుడు సర్వశక్తిమయుడు. ఆయన అష్టైశ్వర్యప్రదాత. కుబేరుడే ఆయన కరుణాకటాక్షవీక్షణాల కోసం చూస్తుంటాడు. శివునికి మహాభిషక్కు అని పేరు. అంటే, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలకు ఉపశమనం శివుని భక్తితో సేవించడం వల్లనే లభిస్తుంది. కానీ, పైన చెప్పినవన్నీ శివుని అపారమైన కరుణతో పోలిస్తే లేశమాత్రమే. ఇక నిండు భక్తితో కొలిస్తే, మనకు లభించనిది ఏముంటుంది? ఆయన కరుణా సముద్రుడు. అందువల్ల మితి లేని ఆయన కరుణ ముందు భౌతిక సంపదలు, వస్తుజాలమంతా సముద్రమునందలి నురుగు యొక్క తరగలు లేక తుంపరలు మాత్రమే.
సముద్రము నందలి నురుగు తెల్లగా ఉంటుంది. కరుణను ఫేనముతో (నురుగుతో) పోల్చడం ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉంది. పోతన మహాకవి, " శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార......ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి......శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గొల్తు భారతీ! " అని సరస్వతీదేవి శుభాకారతను ఫేనముతో (నురుగుతో) పోల్చి స్తుతించాడు.
శివుడు చంద్రధరుడు. చంద్రుడు అమృతాన్ని స్రవించేవాడు. అటువంటప్పుడు చంద్రధరు డెంతటి అమృతమయుడో ఊహకందనిది.
ఈ పద్యం నన్నెచోడుడు రచించిన కుమార సంభవము, దశమాశ్వాసము నందలి బృహస్పతికృత దారిద్ర్యవిద్రావణ స్తవం లోనిది.
No comments:
Post a Comment