గడమున జేటు లేదు, మొలకల్ గలుగున్ బెనువృక్షరాజి య
య్యెడు, ఘనశాఖికాంచల గృహీతదిశాంతములై ద్విజాళి గూం
డ్లిడుకొని గొంతులెత్తి వెలయించు నుషోమధురార్ద్రగానముల్.
నీ రాజ్యంబున ధర్మపుం గొఱత గానీ యో వృధాశోకి ! పృ
ధ్వీరాజ్య ప్రియ కేకి ! వేయి దివిటీల్ వేయించినన్ లేదు నీ
దోరగ్రస్థిత చాపదండ మటులే తూణీర మట్లే సుషు
ప్త్యారంభంబును బొందుచుండ నిటు ధర్మారంభముల్ పొల్చెడున్.
సుమంత్రుడు దశరథుని ఎనిమిది మంది మంత్రులలో ప్రధానమైన వాడు, రథసారథి. పుత్రసంతానం లేక దుఃఖిస్తున్న దశరథుణ్ణి ఊరడిస్తున్నాడు.
" ఓ రాజా ! ఈ భూమి మీద ధర్మానికి కొరత లేనంతకాలం మీ వంశాభివృద్ధికి చేటులేదు. తప్పకుండా వంశాంకురాలు వస్తాయి. అవి పెరిగి పెద్ద చెట్లవుతాయి. వాటి విశాలమైన కొమ్మల మీద పక్షులు గూళ్ళు కట్టుకొని అన్ని దిశలకూ వినపడేటట్లుగా గొంతెత్తి మధురమైన ఉదయగీతాలు పాడుతాయి.
అంతెందుకు. వేయి దివిటీలు వెలిగించి వెతికినా కూడా నీ రాజ్యంలో ధర్మపు కొరత కనిపించదు. అందువల్ల, ఎందుకు అనవసరంగా బాధపడతారు? నీ బాహువిక్రమాన్ని చాటిచెప్పే ధనుర్బాణాలు ఇప్పుడు పని లేకుండా గాఢనిద్రలో ఉన్నాయి . అంటే, ధర్మం కూడా నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. "
రాజు ధర్మ పరిపాలన చేయాలంటే ధర్మానువర్తనం కలిగిన మంత్రులుండాలి. అటువంటివాడు సుమంత్రుడు. అతని స్వాంతన వచనాలు దశరథునికి ఉపశమనం కలిగించేవి. అందువల్లనే, తన మంత్రులను " మీరు మంత్రజ్ఞులు మీరింగితజ్ఞులు ప్రియహితరతులు ధాత్రిపతి కెపుడు " అని మెచ్చుకున్నాడు దశరథుడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టిఖండము నందలివి.
No comments:
Post a Comment