క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి, నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
ఇది శ్రీమదాంధ్ర మహాభాగవతము, ప్రథమస్కంధము నందలి సరస్వతీదేవి స్తుతి పద్యం. ఆంధ్రమహాభాగవతంలో ఆద్యంతము కనిపించే సహజ పాండిత్యుని సహజమైన అంత్యానుప్రాస విన్యాసం ఈ పద్యంలో కూడ కనిపిస్తుంది. ఈ పద్యాన్ని సరస్వతీదేవి రూప వర్ణన పరంగాను, భాగవతకావ్యగత వస్తుధ్వని పరంగాను అర్థం చేసుకొనడానికి ప్రయత్నిద్దాము.
" ఇసుక తిన్నెల వంటి పిరుదులు, తుమ్మెదల గుంపు వంటి అందమైన జడ, రక్షింపబడే దేవతాశ్రేణి, పద్మభవుడైన బ్రహ్మను వశీకరించుకొనగలిగిన వాక్కు, నాలుగు చేతులయందు వరుసగా, స్ఫటికమాల, రామచిలుక, తామరపువ్వు, పుస్తకము ధరించిన, చదువుల తల్లి సరస్వతీదేవికి, నుదురు నేలకు ఆనేటట్లు సాగిలపడి నమస్కరిస్తున్నాను."
ఇది సరస్వతీదేవి భౌతికరూప వర్ణన. చదువుల తల్లిని స్తుతించిన ఈ పద్యంలో కావ్యగత వస్తునిర్దేశం ఏ రకంగా చేయబడ్డదో చూద్దాము.
సైకత శ్రోణి (ఇసుక తిన్నెల) ప్రస్తావన వల్ల కృష్ణునికి గోపికలకు మధ్య గల మధురభక్తి, చంచరీక పదం చేత భ్రమరగీతలు, రక్షితామర శ్రేణి వల్ల అవతార లక్ష్యమైన దుష్ట సంహారం ద్యోతకమౌతున్నాయి. తోయజాతభవుడు బ్రహ్మ. బ్రహ్మ ముఖం నుండి వేదాలు పుట్టాయి. వేదముల యొక్క చిత్తమును వశీకరించుకొనే వాక్కులు ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తుల సారమే భాగవతమని, " తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ " అన్న సమాసం ధ్వనింపజేస్తున్నది. అక్షములు అనగా ఇంద్రియములు. దామము అనగా మాల లేక త్రాడు. ఇంద్రియములనే పశువులను కట్టివేసే త్రాడు. అటువంటి ఇంద్రియనిగ్రహము కలిగిన శ్రీ శుకుడు అనే ' వా ' (విరుద్ధ భావములకు) ' అరి ' (శత్రువు) నుండి ' జ ''(పుట్టినది) భాగవతము. అనగా ప్రాయోపవిష్టుడైన పరీక్షిన్మహారాజునకు శ్రీ శుకునిచే వినిపింపబడినదని అర్థము. అటువంటి మోక్షప్రదాయకమైన పుస్తకమును (భాగవతమును) చేతిలో ధరించిన చదువులతల్లికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను అని పోతన మహాకవి సరస్వతిని ధ్యానించాడు.
ఈ పద్యము నందు గల వస్తుధ్వనికి సంబంధించిన వ్యాఖ్యను " భారతీ వైభావము " అను చిన్న పుస్తకము ద్వారా శ్రీ పాతూరి సీతారామాంజనేయులుగారు తెలుగువారి కందించారు. వారికి అంజలి ఘటిస్తున్నాను.
No comments:
Post a Comment